హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం.. టోల్ టాక్స్ వసూళ్ల కోసం కొత్త చట్టం..!

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వేదికగా అంతర్జాతీయ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల కోసం త్వరలోనే ఒక సరికొత్త వ్యవస్థను అమలు చేయనున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, జలసంధిని దాటే నౌకలపై ప్రత్యేకంగా 'టోల్ పన్ను' విధించనున్నారు.

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం.. టోల్ టాక్స్ వసూళ్ల కోసం కొత్త చట్టం..!
Strait Of Hormuz

Updated on: May 17, 2026 | 2:56 PM

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వేదికగా అంతర్జాతీయ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల కోసం త్వరలోనే ఒక సరికొత్త వ్యవస్థను అమలు చేయనున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, జలసంధిని దాటే నౌకలపై ప్రత్యేకంగా ‘టోల్ పన్ను’ విధించనున్నారు. యుద్ధ నష్టాలను భర్తీ చేయడానికి, తమ సముద్ర తీర రక్షణ వ్యయాన్ని రాబట్టుకోవడానికే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది.

ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు ఇబ్రహీం అజీజీ తెలిపిన వివరాల ప్రకారం.. నౌకాయానం మరింత క్రమబద్ధీకరించడానికి ఇరాన్ ఒక కొత్త ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ఈ వ్యవస్థ ద్వారా నౌకల కోసం ప్రత్యేక నిర్దేశిత మార్గాలను సృష్టించనున్నారు. అలాగే సముద్ర మార్గంలో కల్పించే నిర్దిష్ట సేవలకు గానూ ప్రత్యేక రుసుములను వసూలు చేస్తారు. అయితే, ఈ సౌకర్యాలు మరియు మార్గాలు కేవలం వాణిజ్య నౌకలకు, ఇరాన్‌తో స్నేహపూర్వక సహకారం అందించే దేశాలకు మాత్రమే అందుబాటులో ఉంటాయని అజీజీ స్పష్టం చేశారు. దీని అర్థం, ఇరాన్ తన శత్రు లేదా ప్రత్యర్థి దేశాల నౌకలపై భవిష్యత్తులో కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

మరోవైపు ఇరాన్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రెజా ఆరెఫ్ మాట్లాడుతూ, తమ శత్రు దేశాలకు చెందిన సైనిక పరికరాలను లేదా సైనిక నౌకలను హోర్ముజ్ జలసంధి గుండా వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఇరాన్ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ అలీ నిక్జాద్ మరియు ఎంపీ అలీరెజా అబ్బాసి సంయుక్తంగా స్పందిస్తూ.. దేశ భద్రత, అంతర్జాతీయ చట్టాలు, పొరుగు దేశాల హక్కులను దృష్టిలో ఉంచుకునే ఈ కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. శత్రు దేశాల కోసం సైనిక పరికరాలను మోసుకెళ్లే నౌకలపై అదనపు ఆంక్షలతో పాటు భారీ జరిమానాలు, రుసుములు విధిస్తామని హెచ్చరించారు. ప్రపంచం ఇప్పుడు ఒక సరికొత్త భౌగోళిక-రాజకీయ వ్యవస్థ వైపు పయనిస్తోందని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బధర్ ఘాలిబాఫ్ వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాల మధ్య, ఇరాన్ సైనిక విభాగానికి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) హోర్ముజ్ జలసంధికి సంబంధించిన ఒక కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ పటంలో ఇరాన్ తీరానికి అత్యంత సమీపంలో నౌకల కోసం ఒక కొత్త, సురక్షితమైన మార్గాన్ని చూపించారు. ఇది అంతర్జాతీయ నౌకాయానాన్ని తమ పూర్తి నియంత్రణలోకి తెచ్చుకునే వ్యూహంలో భాగమనే విమర్శలు వస్తున్నాయి. కాగా, ఈ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ త్వరలోనే శాంతి ఒప్పందానికి రాకపోతే, ఆ దేశం తీవ్రమైన ఆర్థిక, సైనిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

హోర్ముజ్ సంక్షోభంపై చైనా అనుసరిస్తున్న దౌత్య వైఖరికి రష్యా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ ప్రాంతంలో శాశ్వత కాల్పుల విరమణే ఏకైక పరిష్కారమని రష్యా దౌత్యవేత్త మిఖాయిల్ ఉల్యనోవ్ పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు, శాశ్వత కాల్పుల విరమణ ద్వారానే హోర్ముజ్ సంక్షోభాన్ని పరిష్కరించగలమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కూడా అభిప్రాయపడ్డారు.

మరోవైపు, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సాగిస్తున్న దాడులను, సముద్ర మార్గాల్లో మందుపాతరల అమరికను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బహ్రెయిన్, అమెరికాలు సంయుక్తంగా ఐక్యరాజ్యసమితిలో ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలను మరింతగా పెంచుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us