తమ దేశంలో ఆధీనంలో ఉన్న తొమ్మిది మంది భారత నావికులను ఇరాన్ విడుదల చేసింది. ఈ నెల ఆరంభంలో ఎమ్‌టీ రియా అనే నావను అదుపులోకి తీసుకున్న ఇరాన్.. అందులో ఉన్న 12మంది సిబ్బందిని అరెస్ట్ చేసింది. తాజాగా వారిలోని తొమ్మిది మందిని విడుదల చేసింది. మరో ముగ్గురు ఇంకా వారి చెరలోనే ఉన్నారు. మరోవైపు ఇటీవల అదుపులోకి తీసుకున్న బ్రిటన్ నౌక స్టెనా ఇంపెరోలోనూ 18మంది భారతీయులు ఉన్నారు. అయితే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రికత్తలు పెరగడంతో ఇరాన్ పలు నావలను ఉల్లంఘనల పేరిట అదుపులోకి తీసుకుంటోంది. దీంతో అనేక మంది భారతీయులు వారి అదుపులోకి వెళ్లారు.
దీంతో పాటు గ్రేస్-1 నావలో ప్రయాణిస్తున్న 24మంది భారత నావికులను బ్రిటన్ ఆధీనంలో ఉన్న జీబ్రాల్టర్ పోలీస్ అధారిటీస్ అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారిని లండన్‌లోని భారత రాయబారులు బుధవారం కలిశారని విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. వారిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ భరోసా ఇచ్చారు.