
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్ భీకర దాడులకు తెగబడింది. శనివారం (మార్చి 21) హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్ల సైనిక స్థావరమైన డియెగో గార్సియాపై రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడి జరిగిన వెంటనే దుబాయ్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ఇరాన్ భూభాగానికి సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరంపై జరిగిన దాడుల్లో ఇది అతిపెద్దది. అత్యంత అరుదైనది. అయితే, ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులను గగనతలంలోనే కూల్చివేసినట్లు అమెరికా అధికారులు ధృవీకరించారు.
ఒక క్షిపణిని గాలిలోనే పేల్చివేశామని, మరొకదాన్ని అమెరికా యుద్ధనౌక నుండి ప్రయోగించిన ఇంటర్‌సెప్టర్ కూల్చివేసిందని అధికారులు తెలిపారు. చాగోస్ దీవుల సమూహంలో ఉన్న డియాగో గార్సియాలో ఈ దాడి జరిగింది. ఆఫ్ఘనిస్థాన్ – ఇరాక్ సరిహద్దులో అమెరికా బాంబు దాడుల కార్యకలాపాలకు ఒక సన్నాహక కేంద్రంగా ఉపయోగిస్తున్న కీలకమైన అమెరికా-యూకే సైనిక స్థావరం ఇది.
డిగో గార్సియాను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం సైనిక నిపుణులలో ఆందోళనలను రేకెత్తించింది. ఇప్పటివరకు, ఇరాన్ క్షిపణి పరిధి పరిమితంగా ఉందని భావించారు. కానీ 4,000 కిలోమీటర్ల దూరం నుండి దాడి చేయడానికి ప్రయత్నించడం, యూరప్‌లోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఇప్పుడు టెహ్రాన్‌కు ఉందని సూచిస్తోంది. పెంటగాన్ ఇంకా అధికారిక ప్రకటన జారీ చేయనప్పటికీ, ఇది యుద్ధ భౌగోళిక స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసిందని భావిస్తున్నారు.
ఒకవేళ ఇరాన్ నిజంగానే డియాగో గార్సియాపై దాడికి ప్రయత్నించి ఉంటే, అది యుద్ధ పరిధిని గణనీయంగా విస్తరించిందని రక్షణ నిపుణులు భావిస్తన్నారు. ఇరాన్ మధ్యప్రాచ్యానికి ఆవల, ఇంకా దక్షిణాన కూడా దాడులు చేయగలదని పశ్చిమ దేశాలకు స్పష్టమైన సందేశం పంపింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి, సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ, బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌ను తీవ్రంగా విమర్శించారు. స్టార్మర్ తన సొంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వెళుతూ, ఇరాన్‌పై దురాక్రమణకు బ్రిటిష్ స్థావరాలను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తున్నారని ఆయన అన్నారు. ఇది బ్రిటిష్ పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందని, ఇరాన్ తన ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటుందని ఆయన హెచ్చరించారు. బ్రిటన్ తీసుకున్న ఈ చర్య తమను నేరుగా యుద్ధంలోకి లాగుతోందని ఇరాన్ భావిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..