Iran vs US: మర్యాదగా మాట్లాడు..! డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇరాన్‌ వార్నింగ్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై చేసిన అగౌరవకరమైన వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ ట్రంప్‌ను హెచ్చరించి, ఖమేనీ పట్ల మర్యాదగా మాట్లాడాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ఒప్పందం కోరుకుంటే తన వ్యాఖ్యలను మార్చుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది.

Iran vs US: మర్యాదగా మాట్లాడు..! డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇరాన్‌ వార్నింగ్‌
Khamenei Vs Trump

Updated on: Jun 28, 2025 | 9:41 AM

ఇరాన్ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “అగౌరవంగా, ఆమోదయోగ్యం కాని” స్వరాన్ని ఇరాన్ ఖండించింది. ఈ విషయమై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్, ట్రంప్‌ను హెచ్చరించారు. ట్రంప్‌ ఒప్పందాన్ని కోరుకుంటే.. తన స్వరాన్ని మార్చుకోవాలని అన్నారు. ఖమేనీ పట్ల మర్యాదగా మాట్లాడాలని పరోక్షంగా ఇరాన్‌ ట్రంప్‌ను హెచ్చరించింది.

“ఒప్పందం కోరుకోవడంలో అధ్యక్షుడు ట్రంప్ నిజాయితీపరుడైతే, ఇరాన్ సుప్రీం నాయకుడు గ్రాండ్ అయతుల్లా ఖమేనీ పట్ల అగౌరవకరమైన, ఆమోదయోగ్యం కాని స్వరాన్ని పక్కన పెట్టి, లక్షలాది మంది ఖమేనీ మద్దతుదారులను బాధపెట్టడం ఆపాలి” అని అబ్బాస్‌ తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. “మన క్షిపణుల వల్ల చతికిలబడకుండా ఉండటానికి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అమెరికా వద్దకు పరిగెత్తడం తప్ప వేరే మార్గం లేదని ప్రపంచానికి చూపించిన గొప్ప, శక్తివంతమైన ఇరానియన్ ప్రజలు, బెదిరింపులు, అవమానాలను తీసుకోరు” అని విదేశాంగ మంత్రి అన్నారు.

ఇంతకీ ట్రంప్‌ ఏమన్నారంటే..?

ఖమేనీని ‘చాలా వికారమైన, అవమానకరమైన మరణం’ నుండి తాను రక్షించానని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ది ట్రూత్‌లో ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీని ఉద్దేశించి.. చాలా వికారమైన, అవమానకరమైన మరణం నుండి కాపాడాను అని పేర్కొన్నారు. “అతను(ఖమేనీ) ఎక్కడ ఆశ్రయం పొందాడో నాకు కచ్చితంగా తెలుసు, ఇజ్రాయెల్ లేదా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా సాయుధ దళాలు అతని జీవితాన్ని అంతం చేయడానికి నేను అనుమతించను” అని ట్రంప్ పోస్ట్‌లో తెలిపారు. దానికి అతను(ఖమేనీ) ‘ధన్యవాదాలు, ప్రెసిడెంట్ ట్రంప్!’ అని చెప్పాల్సిన అవసరం లేదు” అని కూడా జోడించారు.