INDO-AMERICA RELATIONS: అమెరికాతో భారత్ బంధం… మెరుగుదల దిశగా అడుగులు.. జయశంకర్ పర్యటన లక్ష్యమేంటంటే?

భారత, అమెరికా దేశాల మధ్య మైత్రీబంధం మరింత మెరుగుపడబోతోందా? మరో అంతర్జాతీయ కూటమిలో అమెరికా, భారత్‌లు కలిసి పని చేయబోతున్నాయా? కరోనా వంటి విపత్కర పరిస్థితులలో కూడా భారత విదేశాంగ శాఖా...

INDO-AMERICA RELATIONS: అమెరికాతో భారత్ బంధం... మెరుగుదల దిశగా అడుగులు.. జయశంకర్ పర్యటన లక్ష్యమేంటంటే?
Us
Follow us

|

Updated on: May 27, 2021 | 12:05 PM

INDO-AMERICA RELATONS IMPROVE FURTHER: భారత, అమెరికా దేశాల మధ్య మైత్రీబంధం మరింత మెరుగుపడబోతోందా? మరో అంతర్జాతీయ కూటమిలో అమెరికా, భారత్‌లు కలిసి పని చేయబోతున్నాయా? కరోనా వంటి విపత్కర పరిస్థితులలో కూడా భారత విదేశాంగ శాఖా మంత్రి ప్రొఫెసర్ జయశంకర్ (PROF JAYASHANKAR) ఉన్నట్లుండి ఆరు రోజుల సుదీర్ఘ పర్యటన కోసం అగ్రరాజ్యానికి ఎందుకు పయనమయ్యారు? ఈ అంశాలిపుడు తాజా చర్చకు తెరలేపాయి. ఓవైపు కరోనా పాండమిక్ పరిస్థితి (CORONA PANDEMIC SITUATION), మరోవైపు చైనా (CHINA) దూకుడుతో మెజారిటీ ప్రపంచ దేశాలకు ఇబ్బందికరమైన పరిణామాలు ఈనేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి (INDIAN EXTERNAL AFFAIRS MINISTER) పర్యటనకు అగ్రరాజ్యం అమెరికా కూడా ఎక్కడా లేని ప్రాధాన్యతనిస్తోందని ప్రపంచ వార్తా సంస్థలు రాస్తున్నాయి. ఈ క్రమంలో జయశంకర్ పర్యటన ఆసక్తికరంగా మారింది.

భారత విదేశాంగ మంత్రి ప్రొఫెసర్ జయశంకర్‌ సుబ్రహ్మణియన్ ఆరు రోజుల పర్యటన కోసం మే 24 అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా చేరుకున్నారు. డోనాల్డ్‌ ట్రంప్‌ (DONALD TRUMP) హయాంలో రెండు దేశాలమధ్య అత్యంత సాన్నిహిత్యం వున్నట్లు కనిపించేది. కానీ అంతలోనే ట్రంప్ తెంపరితనంతో చేసే ప్రకటనతో సంబంధాలు బెడిసికొట్టినట్లు కూడా అనిపించేది. మొత్తమ్మీద అంతా కన్ఫ్యూజ్‌గా వుండేది. అంతా బాగుందనుకుంటున్న సమయంలో భారతీయుల గురించో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PRIME MINISTER NARENDRA MODI) గురించో లేక మన దేశస్థులు ఆసక్తిగా గమనించే హెచ్1బీ వీసా (H1B VISA)ల గురించో వ్యతిరేక ప్రకటనలు చేసేవారు ట్రంప్. ఒక్క మనదేశంతోనే కాదు.. చాలా ప్రపంచ దేశాలన్నిటి పట్లా ట్రంప్ (TRUMP) వ్యవహారశైలి అలాగే వుండేది. అయితేనేం ట్రంప్ కొనసాగితేనే భారత్, అమెరికా సంబంధాలు బావుంటాయని కేంద్రంలో వున్న ఎన్డీయే కూటమి (NDA ALLIANCE)లో చాలా పార్టీలు, నేతలు భావించేవారు. అందుకే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కావాలని ఆకాంక్షించారు.

పరిస్థితి తారుమారయ్యింది. ట్రంప్ స్థానంలో జో బైడెన్ (JOE BIDEN) అమెరికా అధ్యక్షుడయ్యారు. ట్రంప్‌గా దూకుడుగా కాకుండా అనుభవం నేర్పిన పనితనంతో తనదైన శైలిలో బైడెన్ అచీతూచీ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు. కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) ఇండియాను ముంచెత్తగానే ముందు అమెరికన్లే ముఖ్యమన్న బైడెన్ తన టీమ్‌లోని భారతీయ సంతతి అధికారులు, ముఖ్యుల సూచనలతో వెనక్కి తగ్గారు. ఇండియాకు భారీ సాయాన్ని ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా వెంటనే పంపారు. అమెరికాలో వున్న ట్రంప్‌ అనుకూల భారత సంతతి పౌరుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిపడటంతో వెనువెంటనే సరిదిద్దుకుంది. మన దేశంలో ఆక్సిజన్‌ (OXYGEN)కు తీవ్ర కొరత ఎదురై అనేకమంది మృత్యువాతపడినప్పుడు భారీ ఆక్సిజన్‌ ప్లాంట్‌ల నిర్మాణానికి అవసర మైన ఉపకరణాలనూ, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లనూ అందజేసింది. జయశంకర్‌ తన పర్యటన సందర్భంగా కరోనా వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తున్న ఫైజర్ (FYZER), మోడెర్నా (MODERNA), జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (JOHNSON AND JOHNSON) సంస్థల ప్రతినిధులతో కూడా మాట్లాడతారని తెలుస్తోంది. ఆ వ్యాక్సిన్‌లు మన దేశానికి అందించడానికి పాటించదల్చుకున్న విధివిధానాలేమిటో ఆయన అక్కడి ప్రభుత్వంతో కూడా చర్చిస్తారు. అమెరికా దగ్గరున్న 8 కోట్ల డోసుల వ్యాక్సిన్‌లను అవసరమైన దేశాలకు అందజేస్తామని ఈమధ్యే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. మన దేశం రెండో దశ కరోనా వేవ్‌లో భారీ జన నష్టాన్ని చవిచూసినందువల్ల ఆ వ్యాక్సిన్‌లను భారత్‌లోనే తయారుచేయడానికి గల సాధ్యాసాధ్యాలను కూడా జయశంకర్‌ చర్చించే అవకాశముంది. వ్యాక్సిన్ల తయారీ విధానంపై వున్న పేటెంట్‌ హక్కుల్ని తాత్కాలికంగా సడలించి, వెనకబడిన దేశాలు సైతం వాటిని స్వేచ్ఛగా ఉత్పత్తి చేసుకోవడానికి అనుమతించాలని ప్రపంచ వాణిజ్య సంస్థలో గత అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా (SOUTH AFRICA)తోపాటు మన దేశం కోరినప్పుడు అమెరికా సానుకూలంగా స్పందించింది. ప్రపంచ జనాభా మొత్తం సాధ్యమైనంత త్వరగా కరోనా నియంత్రణ టీకాలు వేసుకుంటేనే అన్ని దేశాలూ సురక్షితంగా వుండగలవని, ఈ విషయంలో ఎవరు వెనకబడినా అందరికీ ప్రమాదమేనని మన దేశం వాదించింది. ఈ అంశాలన్నీ మరోసారి చర్చల్లోకొస్తాయి. పేటెంట్ల సడలింపులో యూరప్‌ దేశాలను ఒప్పంచాలని అమెరికా అధ్యక్షున్ని జయశంకర్‌ కోరే అవకాశం వుంది.

ఇక జయశంకర్ పర్యటనలో మరో కీలకాంశం ఇండో-పసిఫిక్ కూటమి (INDO-PACIFIC ALLIANCE) వ్యవహారం. చానాళ్ళుగా కేవలం ప్రతిపాదనలకే పరిమితమైన ఈ కూటమి దిశగా జయశంకర్ అమెరికన్ ప్రభుత్వాధినేతలతో సమాలోచనలు జరిపేలా ఎజెండా రూపొందించారు. ఇండో-పసిఫిక్ రీజియన్ పలు దేశాలకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న చైనా దూకుడుకు బ్రేక్ వేయాలంటే అమెరికా, ఆస్ట్రేలియా (AUSTRALIA), భారత్, జపాన్ (JAPAN) దేశాలతో కలసి ఓ కూటమి ఏర్పడాలని అమెరికా ప్రతిపాదిస్తోంది. దానికి మిగిలిన మూడు దేశాలతోపాటు దక్షిణ కొరియా (SOUTH KOREA)కూడా సుముఖంగా వుంది. ఈ కూటమిలో చేరతామని దక్షిణ కొరియా గతంలోనే ప్రకటించింది. బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా వున్నప్పుడే ఈ ఆలోచన అమెరికాలో మొగ్గతొడిగింది. అది ట్రంప్‌ హయాంలో ఇంకాస్త విస్తృతమైంది. మొదట్లో ఎన్నో అవరోధాలు ఏర్పడి, దాదాపు మూలనబడిందనుకున్న ఆ ప్రతిపాదన ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి రూపం సంతరించుకుంటోంది. ట్రంప్‌ తీరుతెన్నులెలావున్నా, ఆ విషయంలో ఎంత అసంతృప్తివున్నా చైనా దూకుడు చూసి… దానితో పడుతున్న సమస్యలు నానాటికీ పెరగడం గమనించి మనతో పాటు జపాన్, ఆస్ట్రేలియా కూడా ఇండో–పసిఫిక్‌ కూటమిపై ఆసక్తి ప్రదర్శించాయి. దక్షిణ కొరియా సైతం దీనిలో భాగస్వామిగా మారేందుకు ముందుకొస్తోంది. అయితే ఈ కూటమి గురించి పాటుపడుతూనే ట్రంప్‌ అప్పుడప్పుడు అంతర్జాతీయ కూటములపై నిరాసక్తత కనబరి చేవారు. ఏనాటినుంచో వున్న నాటో కూటమిపైనే ఆయన ఎన్నో షరతులు విధించడం మొదలె ట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మిత్ర దేశాల్లో ఒకరకమైన అనిశ్చితి ఆవహించడంలో వింతేమీ లేదు. కానీ జో బైడెన్‌ అధికారంలోకొచ్చాక ఇంటా, బయటా ఆయన దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. దాని పర్యవసానంగానే జైశంకర్‌ అయిదు రోజుల విస్తృత పర్యటన సాధ్య మైంది. ట్రంప్‌ వల్ల ఎన్ని సమస్యలొచ్చినా ఆయనైతేనే ఇరుదేశాల సంబంధాలూ సవ్యంగా సాగుతాయన్న అభిప్రాయం మోదీతో సహా అందరికీ వుంది. అయితే బైడెన్‌ రావడం కూడా మంచి పరిణామమేనని ఇప్పుడు ప్రభుత్వంలోని వారంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన టీంలో వున్నవారిలో మెజారిటీ సభ్యులు గతంలో మనదేశంతో మంచి సంబంధాలున్న వారు. అందువల్లే కావొచ్చు… బైడెన్‌ వచ్చిన వెంటనే భారత్‌తో మరింత మైత్రీబంధం ఏర్పడ టానికి అవసరమైన చర్యలు ప్రారంభించారు. ద్వైపాక్షిక రంగంలోనే కాక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో కలిసి పనిచేయడానికి ఏమేం చేయాలో ఖరారు చేసుకున్నారు.

డొనాల్డ్ ట్రంప్‌ పరిపాలనలో అమెరికా నిరాసక్తత వల్ల బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ తప్పదన్న అభిప్రాయం కలగడంతో మన దేశం యూరప్‌ దేశాల చొరవకు అనుకూలంగా స్పందించింది. అలాగే చైనాతో సంబంధాలు పెంచుకోవటానికి, రష్యాతో వున్న మైత్రీబంధాన్ని మరింత విస్తరించుకోవటానికి ప్రయత్నించింది. కానీ జమ్మూ–కశ్మీర్‌ ప్రతిపత్తి మార్చిన తర్వాత చైనా మన దేశం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించటం, దానికి ముందూ.. తర్వాత కూడా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించడం వంటి చర్యలతో మనకు ఇబ్బందికరంగా డ్రాగన్ కంట్రీ వ్యవహరించింది. ఈలోగా బైడెన్‌ ఎంట్రీ తర్వాత అమెరికా మళ్లీ అంతర్జాతీయంగా చురుకైన పాత్ర పోషించటం మొదలుపెట్టడంతో అగ్రరాజ్యంతో ఇండియా సన్నిహితమైంది. ఈ నేపథ్యంలో సాగుతున్న జయశంకర్‌ తాజా పర్యటనతో రెండు దేశాల మధ్య బంధం మరింత పటిష్టమవుతుందన్న అంఛనాలు వ్యక్తమవుతున్నాయి.