
యెమెన్ పశ్చిమ తీరంలో వాణిజ్య నౌకపై మరోసారి దాడి జరిగింది. ఎర్ర సముద్రంలో భారత జెండా కలిగిన ఎంఎస్‌వి ఫైజ్ నూర్ ఔలియాపై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడి తీవ్ర కలకలం రేపింది. పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్ బోట్‌తో ఈ దాడి జరిగినట్లు యెమెన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దాడి తీవ్రత కారణంగా నౌక మునిగిపోయింది. అయితే, నౌకలో ఉన్న మొత్తం 14 మంది సిబ్బందిని యెమెన్ తీరరక్షక దళాలు సురక్షితంగా రక్షించాయి. రక్షించిన వారిలో 13 మంది భారతీయులు కాగా, ఒకరు యెమెన్ జాతీయుడు ఉన్నారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దాడిని తీవ్రంగా ఖండించింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) విడుదల చేసిన ప్రకటనలో, భారత జెండా కలిగిన వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడి తీవ్రంగా ఖండించింది. దాడి అనంతరం నౌక మునిగిపోయినప్పటికీ, అందులో ఉన్న భారతీయ సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడటం ఊరటనిచ్చే అంశమని తెలిపింది. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం యెమెన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. సిబ్బంది భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని విదేశాంగ శాఖ వెల్లడించింది. సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించిన యెమెన్ ప్రభుత్వానికి భారత్ కృతజ్ఞతలు తెలిపింది.
ఈ ఘటన నేపథ్యంలో ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల భద్రతపై మరోసారి అంతర్జాతీయ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న దాడులు ప్రపంచ వాణిజ్య రవాణాపై ప్రభావం చూపుతున్నాయని భారత్ పేర్కొంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం వెంటనే ఆపాలని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానాన్ని పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. సముద్ర భద్రతను కాపాడడం, ప్రపంచ వాణిజ్య మార్గాలను రక్షించడం అంతర్జాతీయ సమాజం ఉమ్మడి బాధ్యత అని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Our statement on attack on an Indian flagged commercial vessel ⬇️
🔗 https://t.co/5dNzioU4jv pic.twitter.com/rGgtnl0luu
— Randhir Jaiswal (@MEAIndia) August 4, 2026
ఇటీవల భారతీయ సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్న మరో ఘటన కూడా చోటుచేసుకుంది. జూలై 18న రష్యా ప్రాదేశిక జలాల్లో ప్రయాణిస్తున్న ఎంవి ఒమోర్ఫి నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులతో సహా మొత్తం పది మంది సిబ్బంది ఉన్నారు. ఆ ఘటనలో భారతీయ చీఫ్ ఆఫీసర్ సాగర్ గుప్తా ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు భారతీయులను సురక్షితంగా రక్షించారు. ఈ వరుస సంఘటనలు ప్రపంచంలోని కీలక సముద్ర మార్గాల్లో భద్రతా పరిస్థితులపై మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. భారత ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి సముద్ర భద్రతను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మరోసారి ప్రస్తావిస్తూ, వాణిజ్య నౌకలు మరియు వాటి సిబ్బంది రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..