AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూఢచార సంస్థకే కన్నం.. మాజీ అధికారి ‘బంగారు’ లీలలు చూసి ఎఫ్‌బీఐ మైండ్ బ్లాక్!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, తిరుగులేని గూఢచర్య సంస్థగా అమెరికాకు చెందిన 'సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ' (CIA)కి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాధినేతలనే బోల్తా కొట్టించి, అత్యంత రహస్య సమాచారాన్ని సేకరించడంలో సీఐఏ దిట్ట. అలాంటి ప్రపంచ ప్రసిద్ధ నిఘా సంస్థకే ఒక మాజీ అధికారి భారీ కన్నం వేశాడు. సంస్థ కళ్ళుగప్పి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, బంగారాన్ని దోచేశాడు.

గూఢచార సంస్థకే కన్నం.. మాజీ అధికారి 'బంగారు' లీలలు చూసి ఎఫ్‌బీఐ మైండ్ బ్లాక్!
Central Intelligence Agency
Balaraju Goud
|

Updated on: May 29, 2026 | 1:44 PM

Share

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, తిరుగులేని గూఢచర్య సంస్థగా అమెరికాకు చెందిన ‘సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ’ (CIA)కి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాధినేతలనే బోల్తా కొట్టించి, అత్యంత రహస్య సమాచారాన్ని సేకరించడంలో సీఐఏ దిట్ట. అలాంటి ప్రపంచ ప్రసిద్ధ నిఘా సంస్థకే ఒక మాజీ అధికారి భారీ కన్నం వేశాడు. సంస్థ కళ్ళుగప్పి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, బంగారాన్ని దోచేశాడు. చివరకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) రంగంలోకి దిగడంతో ఈ భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఆ మాజీ అధికారి ఇంట్లో దొరికిన కుబేరుడి ఖజానాను చూసి ఎఫ్‌బీఐ అధికారులే నోరెళ్లబెట్టారు.

సీఐఏ మాజీ అధికారి డేవిడ్ రష్ నివాసంపై ఎఫ్‌బీఐ అధికారులు జరిపిన సోదాల్లో నమ్మశక్యం కాని రీతిలో సంపద బయటపడింది. అతడి ఇంట్లో ఒక్కోటి కిలో బరువున్న 300 బంగారపు బిస్కెట్లు దొరికాయి. వీటితో పాటు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రోలెక్స్ మోడళ్లకు చెందిన 35 లగ్జరీ వాచ్‌లు, సుమారు 2 మిలియన్ డాలర్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రష్ ఇంట దొరికిన మొత్తం బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 40 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.382 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ భారీ అక్రమ ఆస్తుల కేసులో డేవిడ్ రష్‌ను ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.

డేవిడ్ రష్ సీఐఏలో విధులు నిర్వహిస్తున్న సమయంలో, అధికారిక ఉద్యోగ అవసరాల పేరిట 2025-26 మధ్యకాలంలో ప్రభుత్వం నుంచి ఈ భారీ మొత్తంలో బంగారం, నగదును డ్రా చేసినట్లు ఎఫ్‌బీఐ గుర్తించింది. అయితే, నిఘా సంస్థ కావడంతో సీఐఏ తమ అంతర్గత ఖర్చుల వివరాలను బయటకు వెల్లడించలేదు. ఈ లొసుగును ఆసరాగా చేసుకుని, రహస్య ఆపరేషన్ల కోసం కేటాయించిన ప్రభుత్వ నిధులను, బంగారాన్ని రష్ నేరుగా తన సొంత ఇంటికి తరలించుకున్నాడు. ప్రజల సొమ్మును వ్యక్తిగత విలాసాల కోసం దారిమళ్లించినట్లు తేలడంతో ఎఫ్‌బీఐ అతనిపై ప్రజాధనం దుర్వినియోగం కింద కేసు నమోదు చేసింది.

డేవిడ్ రష్ గతం కూడా వివాదాస్పదంగా ఉన్నట్లు ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలింది. అతను 2015 వరకు అమెరికా నేవీలో పనిచేశాడు. అక్కడ తాను పైలట్‌గా సేవలు అందించానని రష్ చెప్పుకోగా, ఎఫ్‌బీఐ పరిశీలనలో అతను కేవలం రిజర్వు సిబ్బంది మాత్రమేనని తేలింది. నేవీలో ఉన్న సమయంలో కూడా అతను పలు అక్రమాలకు పాల్పడినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం సీఐఏలో అతని అసలు హోదా ఏంటనే దానిపై అధికారులకు ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం వర్జీనియాలోని అలెగ్జాండ్రియా కోర్టులో రష్‌పై విచారణ జరగనుంది.

ఈ ఊహించని స్కామ్ నేపథ్యంలో సీఐఏ తన అంతర్గత ఆర్థిక లావాదేవీలపై, రహస్య నిధుల ఖర్చులపై పునఃసమీక్ష జరపాలని నిర్ణయించింది. సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ స్వయంగా ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదిలావుంటే, ఈ ఘటన అమెరికా రక్షణ, నిఘా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రపంచాన్నే శాసించే సీఐఏ, తన సొంత అధికారి చేతిలోనే ఇలా మోసపోవడం ఆ సంస్థ భద్రతా లొసుగులను ఎత్తిచూపుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us