చదివేస్తే వున్న మతిపోయినట్టు వ్యవహరించారు ముగ్గురు ఎన్నారైలు. ఓ యువకుడితో వెట్టి చాకిరి చేయించడమే కాకుండా చావబాదారు. ఆ త్రీ ఇడియట్స్ శాడిజంపై మిస్సోరి కాప్స్ కూపీలాగుతున్నారు. అమెరికా మిస్సోరీలో ఎన్నారై సత్తారు వెంకటేష్ రెడ్డి అండ్ డర్టీ గ్యాంగ్ ఆగడాలు సంచలనం రేపాయి. ఉపాధి పేరుతో ఓ యువకుడితో వెట్టి చాకిరీ చేయించుకోవడమే కాకుండా అతన్ని పైశాచికంగా హింసించిన వైనం తెరపైకి వచ్చింది. బాధితుడు ఓ రెస్టారెంట్‌లో పరిచయమైన వ్యక్తికి తన గోడును చెప్పుకున్నాడు. బాధితుడు షేర్ చేసిన వీడియోలను సదరు వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆరా తీస్తే సత్తారు వెంకటేష్ రెడ్డి. పెన్మత్స నిఖిల్. పెనుచ్చ శ్రవణ్‌ల నిర్వాకం దర్యాప్తులో బయటపడింది. బాధితుడితో మసాజ్ చేయించుకోవడం.. ఐరన్ రాడ్స్‌తో ..కరెంట్ వైర్లతో అతనిపై దాడి చేయడం వంటి వీడియోలు కాప్స్‌కు చిక్కాయి.
సత్తారు వెంకటేష్‌రెడ్డి ఇంట్లో లేనప్పుడు నిఖిల్, శ్రవణ్‌లు తనపై పైశాచికత్వాన్ని పొందేవారని వివరించాడు. యూఎస్ వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 7 నెలల్లో ఏకంగా 30 కిలోల బరువు తగ్గాడని పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా నీరసించిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సత్తారు వెంకటేష్ వద్దకు ఈ యువకుడు ఎలా వచ్చాడు? ఈ దారుణ హింసాకాండకు గల కారణాలు ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సత్తారు వెంకటేష్‌రెడ్డి, నిఖిల్, శ్రవణ్‌లను పోలీసులు నాన్-బెయిలబుల్ వారెంట్‌పై అరెస్టు చేశారు. మానవ అక్రమ రవాణా, హింసాత్మక సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తానికి ఈఘటన మిస్సోరిలోని ఎన్నారైలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..