ఇంధన సంక్షోభం.. ప్రపంచవ్యాప్తంగా తెరపైకి కొత్త ఆంక్షలు.. ఏ దేశంలో ఎలా ఉన్నాయంటే?

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. చమురు ధరల పెరుగుదల, విద్యుత్ వినియోగాన్ని అదుపు చేసేందుకు వివిధ దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఫ్లైట్ల నిషేధం, వర్క్ ఫ్రమ్ హోమ్, వారంలో పనిదినాల తగ్గింపు, విద్యుత్ పొదుపు ఆంక్షలు వంటివి తెరపైకి తీసుకొస్తున్నాయి. పౌరుల జీవనశైలిలో గణనీయమైన మార్పులు అనివార్యమవుంటున్నాయి.

ఇంధన సంక్షోభం.. ప్రపంచవ్యాప్తంగా తెరపైకి కొత్త ఆంక్షలు.. ఏ దేశంలో ఎలా ఉన్నాయంటే?
Energy Crisis Global

Edited By:

Updated on: May 13, 2026 | 11:37 AM

పారిస్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రస్థాయిలో భయపెడుతోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఏకంగా మూడు గంటల లోపు దూరం ఉండే ప్రయాణాలకు డొమెస్టిక్ ఫ్లైట్స్ పూర్తిగా నిషేధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు మండిపోతుండటంతో అన్ని దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాయి. పెట్రోల్ తో పాటు విద్యుత్ వినియోగాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వాలు సామాన్యుల జీవితాల్లో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. పొదుపు మంత్రాన్ని జపిస్తూ ఎనర్జీ క్రైసిస్ నుంచి బయటపడేందుకు కఠినమైన ఆంక్షలను తప్పనిసరి చేస్తున్నాయి.  ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ ఏకంగా వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని మాత్రమే అమల్లోకి తెచ్చింది. కరెంటు ఆదా కోసం సూపర్ లీగ్ మ్యాచ్ లను ఖాళీ స్టేడియాల్లో ఆడిస్తూ స్కూళ్లకు సైతం తాళాలు వేసింది.

మరోవైపు శ్రీలంక ప్రభుత్వం ఏకంగా ప్రతి బుధవారాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించి పౌరులు వాహనాలు బయటకు తీయకుండా అడ్డుకట్ట వేస్తోంది. బంగ్లాదేశ్ లో రాత్రి ఏడు గంటలకే షాపింగ్ మాల్స్ మూసివేస్తూ వేడుకల్లో డెకరేటివ్ లైట్లను పూర్తిగా నిషేధించారు. థాయ్ లాండ్ లో ఆఫీసుల్లో కోట్లు టైలు వేసుకోవద్దని సూచిస్తూ ఏసీలను ఇరవై ఏడు డిగ్రీలకు మాత్రమే పరిమితం చేశారు. ఇటు చైనా సైతం పెట్రోల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును భారీగా ప్రోత్సహిస్తోంది.

ఇక అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ తెరపైకి వచ్చింది. ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే పని చేస్తే ట్రాఫిక్ తగ్గిపోయి భారీగా ఇంధనం ఆదా అవుతుందని అగ్రరాజ్యం అంచనా వేస్తోంది. ఫిలిప్పీన్స్ సైతం ఇదే బాటలో నడుస్తూ విద్యుత్ పొదుపు కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని పక్కాగా అమలు చేస్తోంది. బ్రిటన్ తమ హైవేలపై వాహనాల వేగాన్ని గంటకు ఎనభై కిలోమీటర్లకు తగ్గించి ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెంచుతోంది. బ్రెజిల్ ప్రభుత్వం సొంత వాహనాలకు బదులుగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎక్కువగా వాడాలని ప్రచారం మొదలుపెట్టింది. స్పెయిన్ లో విద్యుత్ వినియోగాన్ని అదుపులో ఉంచేందుకు ఆఫీసుల పనివేళలను కుదించి ముందుగానే మూసివేస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో కచ్చితంగా ఏసీ ఉష్ణోగ్రతలు ఇరవై ఏడు డిగ్రీలు ఉండాలని ఇటలీ దేశం కఠిన నిబంధనలు పెట్టింది. ఈ చర్యలన్నీ పెట్రోల్ డీజిల్ తో పాటు పవర్ డిమాండ్ ను సమతుల్యం చేసేందుకు తీసుకున్నవే అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా తమ దైనందిన జీవనశైలిని పూర్తిగా మార్చుకుంటున్నారు. చమురు కొరతతో మొదలైన ఈ గ్లోబల్ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. పర్యావరణ పరిరక్షణతో పాటు వనరుల ఆదా కోసం భవిష్యత్తులో మరిన్ని వినూత్న నిర్ణయాలు చూసే అవకాశం ఉంది. ప్రతి యూనిట్ కరెంటును ప్రతి చుక్క పెట్రోల్ ను పొదుపు చేయడమే ఇప్పుడు సామాన్యుల ముందున్న ఏకైక ప్రత్యామ్నాయ మార్గమని విశ్వేషకులు అంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us