Srilanka Crisis News: భారత పొరుగు దేశం శ్రీలంక రావణకాష్ఠంలా రగులుతూనే ఉంది. ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరడంతో ద్వీప దేశంలో ప్రభుత్వంపై ప్రజాగ్రహం కట్టలుతెంచుకుంది. రాజకీయ నేతలు, పాలకులు, అధికారులే లక్ష్యంగా దాడులకు దిగారు. ఆందోళనకారుల దాడులు, అల్లర్లలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందారు. కొలంబోలో హింసాత్మక ఆందోళనలు చోటు చేసుకోవడంతో.. మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో సోమవారంనాడు ఆ దేశ ప్రధాని పదవికి మహేంద రాజపక్సె(Mahendra Rajapaksa) రాజీనామా చేశారు. బుధవారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సె ఒకట్రెండు రోజుల్లోనే కొత్త ప్రభుత్వంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజపక్సె కుటుంబం నుంచి ఎవరూ లేకుండా ఈ యంగ్ కేబినెట్ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఆ దేశ తదుపరి ప్రధాని ఎవరన్న అంశంపై ఉత్కంఠ నెలకొంటోంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆ దేశ మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే(Ranil Wickremesinghe) మరోసారి దేశ ప్రధాని అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై గొటబయ రాజపక్సె ఇవాళ(గురువారం) అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికార, విపక్షాలతో కూడిన ‘ఐక్య’ ప్రభుత్వం ఏర్పాటు కావాలని అధ్యక్షుడు గొటబయ భావిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి రణిల్ విక్రమసింఘే సారథ్యంవహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 225 మంది సభ్యులతో కూడిన శ్రీలంక పార్లమెంటులో.. పార్టీలకు అతీతంగా పలువురి మద్ధతు రణిల్‌కు ఉంది. చివరి క్షణంలో ఏమైనా మార్పులు జరిగితే తప్ప.. గురువారంనాడే రణిల్ విక్రమసింఘే ప్రమాణస్వీకారం ఉండొచ్చని దేశాధ్యక్షుడు గొటబయకి సన్నిహితుడైన ఓ సీనియర్ అధికారి ఏఎఫ్‌పీ వీడియా సంస్థకు తెలిపారు.
శ్రీలంకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆహ్వానాన్ని ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ నిరాకరించింది. దేశాధ్యక్షుడిగా గొటబయ కొనసాగితే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని ప్రతిపక్ష నేతలు స్పష్టంచేశారు. అయితే ఎస్‌జేబీకి చెందిన కనీసం 10-12 మంది ఎంపీల మద్ధతు రణిల్ విక్రమసింఘేకు ఉన్నట్లు తెలుస్తోంది. 73 ఏళ్ల రణిల్.. 1993 నుంచి ఐదుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన అనుభవం ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకు అక్కరకు వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అదే సమయంలో శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడం అంత ఈజీ కాదని.. ఓ రకంగా రణిల్ అగ్ని పరీక్షనే ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.
భారత్‌తో రణిల్‌కు సత్సంబంధాలు..
రాజపక్సె ప్రభుత్వం లేదు లేదంటూనే చైనా అనుకూల వైఖరిని అవలంభించిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేకి భారత అనుకూల వైఖరి కలిగిన శ్రీలంక నాయకుడిగా పేరుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భారత్ శ్రీలంకకు అందిస్తున్న సాయంపై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ చాలా రకాలుగా శ్రీలంకకు సాయాన్ని అందిస్తోందని, దీనికి తాము రుణపడి ఉంటామన్నారు. శ్రీలంకలో పెట్టుబడులు పెట్టాలని చైనాను రాజపక్సె ప్రభుత్వం కోరినా.. చైనా నుంచి పెద్దగా పెట్టబడులు ఏమీ రాలేదన్నారు. రాజపక్సె ప్రభుత్వ తప్పిదాల కారణంగానే మిగులు బడ్జెట్‌లో ఉన్న శ్రీలంక అప్పులపాలై ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని అన్నారు. గత రెండేళ్లుగా ఆర్థిక వ్యవస్థను రాజపక్సె ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ఐఎంఎఫ్ సాయం తీసుకోవాలని సెంట్రల్ బ్యాంకు సూచించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.
Also Read..
Hyderabad: విశ్వనగరి సిగలో ప్రతిష్టాత్మక కంపెనీ.. మరో ఏరోస్పేస్ కంపెనీ భారీ పెట్టుబడులు
Tomato Flu Virus: కేరళలో టమాటా ఫ్లూ విజృంభణ.. సరిహద్దు రాష్ట్రాలు అలెర్ట్