
వాషింగ్టన్, జూన్ 15: ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) వినూత్న చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అలబామా రాష్ట్రంలోని హంట్స్‌విల్లేలో పూర్తిస్థాయి నకిలీ పట్టణాన్ని నిర్మించింది. సుమారు 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రత్యేక కేంద్రానికి ‘కైనెటిక్ సైబర్ రేంజ్’ అని పేరు పెట్టారు. ఇది సాధారణ అమెరికన్ పట్టణంలా కనిపించేలా రూపొందించబడింది. ఇందులో పూర్తిస్థాయి ఇళ్లు, హోటల్, పెట్రోల్ బంక్, కిరాణా దుకాణం, కోర్టు భవనం, ఆస్పత్రి, విద్యుత్ సంస్థతో పాటు రహదారులు, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేశారు.
సైబర్ భద్రతా శిక్షణను తరగతి గదులకు మాత్రమే పరిమితం చేయకుండా, వాస్తవ పరిస్థితులను అనుభవించేలా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ హ్యాకర్ గ్యాంగులు లక్ష్యంగా చేసుకుంటున్న ఆధునిక సాంకేతిక వ్యవస్థలపై ప్రత్యక్ష అనుభవాన్ని దర్యాప్తు అధికారులకు అందిస్తున్నారు. FBI తాజా ఇంటర్నెట్ క్రైమ్ నివేదిక ప్రకారం, అమెరికాలో సైబర్ నేరాల కారణంగా జరిగిన నష్టాలు 20.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఏడాది వ్యవధిలోనే 26 శాతంమేర పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ర్యాన్సమ్‌వేర్ దాడులు ప్రపంచవ్యాప్తంగా కీలక మౌలిక వసతులకు అతిపెద్ద ముప్పుగా మారాయి.
ఈ నకిలీ పట్టణంలోని ప్రతి భవనంలో నిజ జీవితంలో ఉపయోగించే పరికరాలు, నెట్‌వర్క్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. దీంతో శిక్షణలో భాగంగా ఆస్పత్రి విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వంటి సైబర్ దాడులను కృత్రిమంగా సృష్టించి, వాటిని ఎలా ఎదుర్కోవాలో అధికారులకు నేర్పిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సురక్షిత వాతావరణంలోనే జరుగుతుంది. కాబట్టి మాల్వేర్ లేదా వైరస్‌లు పబ్లిక్ ఇంటర్నెట్‌లోకి వ్యాపించే ప్రమాదం ఉండదు. ఈ కేంద్రంలో 200కుపైగా ఫిజికల్ సర్వర్లతో కూడిన భారీ డేటా సెంటర్ కూడా ఉంది. వాస్తవ సైబర్ దాడుల దర్యాప్తు సమయంలో ఎదురయ్యే పరిస్థితులను ప్రతిబింబించేలా సర్వర్ గదులను చల్లగా, ఇరుకుగా, శబ్దభరితంగా రూపొందించారు. 2025 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ కైనెటిక్ సైబర్ రేంజ్‌లో ఇప్పటికే 1400 మందికి పైగా దర్యాప్తు అధికారులు శిక్షణ పొందారు. వీరిలో FBI సిబ్బందితో పాటు అంతర్జాతీయ భద్రతా సంస్థలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. డిజిటల్ ఫోరెన్సిక్స్, ఎన్‌క్రిప్షన్ బ్రేకింగ్, సైబర్ దాడుల విశ్లేషణ వంటి అంశాల్లో ఈ శిక్షణ కీలకంగా ఉపయోగపడుతోందని అధికారులు వెల్లడించారు. ఆధునిక సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ నకిలీ పట్టణం కీలక పాత్ర పోషిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.