నీరవ్ మోదీకి యూరోపియన్ కోర్టులో షాక్.. భారత్‌‌ రప్పించేందుకు మార్గం సుగమం..!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో వేల కోట్ల రూపాయల మోసానికి సంబంధించి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు కీలక మలుపు వచ్చింది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ECHR) నీరవ్ మోదీ దాఖలు చేసిన చివరి అప్పీల్‌ను తిరస్కరించింది. దీంతో అతని లీగల్ పోరాటానికి ముగింపు పలికినట్లైంది.

నీరవ్ మోదీకి యూరోపియన్ కోర్టులో షాక్.. భారత్‌‌ రప్పించేందుకు మార్గం సుగమం..!
Nirav Modi

Updated on: Jul 06, 2026 | 3:56 PM

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో వేల కోట్ల రూపాయల మోసానికి సంబంధించి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు కీలక మలుపు వచ్చింది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ECHR) నీరవ్ మోదీ దాఖలు చేసిన చివరి అప్పీల్‌ను తిరస్కరించింది. దీంతో అతని లీగల్ పోరాటానికి ముగింపు పలికినట్లైంది.

ఇప్పటికే బ్రిటన్ హైకోర్టులు కూడా భారత్‌లోని జైళ్లలో భద్రత, వసతులపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను సంతృప్తికరంగా పరిగణించాయి. దీంతో నీరవ్ మోదీకి ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలు పూర్తిగా మూసుకుపోయినట్లు న్యాయ వర్గాలు చెబుతున్నాయి. బ్రిటన్ కోర్టులతో పాటు యూరోపియన్ స్థాయిలోనూ అతనికి అందుబాటులో ఉన్న లీగల్ ఆప్షన్స్ అన్నీ ముగిసినట్లు స్పష్టమవుతోంది.

2019 మార్చి నుంచి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో నిర్బంధంలో ఉన్న నీరవ్ మోదీ, తనను భారత్‌కు అప్పగిస్తే అక్కడ తనకు హింస ఎదురవుతుందని వాదిస్తూ పలు అప్పీళ్లు దాఖలు చేశారు. అయితే ఈ వాదనలను భారత్ తరఫున సీబీఐ, ఈడీ అధికారులు బలమైన ఆధారాలతో ఖండించినట్లు సమాచారం. సంజయ్ భండారీ కేసు తరహాలో చేసిన హింస ఆరోపణలను కూడా న్యాయస్థానాలు విశ్వసించలేదని తెలుస్తోంది.

లీగల్ అడ్డంకులు తొలగిపోవడంతో బ్రిటన్ అధికారులు అప్పగింత ప్రక్రియను ప్రారంభించినట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. అవసరమైన పరిపాలనా ప్రక్రియలు పూర్తయిన వెంటనే నీరవ్ మోదీని భారత్‌కు తరలించే అవకాశముందని సమాచారం.

ఈ పరిణామంతో భారత్‌లోని బ్యాంకింగ్ మోసాల కేసుల్లో ఒక కీలక అధ్యాయం ముగిసే దిశగా సాగుతోంది. పీఎన్‌బీ మోసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీని స్వదేశానికి తీసుకురావడం భారత్ దర్యాప్తు సంస్థలకు పెద్ద విజయంగా భావిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us