Rath Yatra: రథయాత్రలో భక్తులపై గుడ్లు విసిరిన దుండగులు.. మాజీ సీఎం ఏమన్నారంటే..?

దేవుడి రథయాత్రలో భక్తులపై గుడ్లు విసరడం కలకలం రేపింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుడి రథయాత్ర అట్టహాసంగా సాగుతోంది. భక్తులు పాటలతో ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. అయితే కొంతమంది దుండగులు భక్తులపై గుడ్లు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఫైర్ అయ్యారు.

Rath Yatra: రథయాత్రలో భక్తులపై గుడ్లు విసిరిన దుండగులు.. మాజీ సీఎం ఏమన్నారంటే..?
Eggs At Rath Yatra

Updated on: Jul 14, 2025 | 8:39 PM

జగన్నాథుడి రథయాత్రకు ఎంతో విశిష్ఠత ఉంటుంది. ఇక పూరీలో జరిగే రథయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్షల మంది ఈ యాత్రలో పాల్గొంటారు. పూరీతో పాటు పలు ప్రాంతాల్లో రథయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. అయితే దేవుడి రథయాత్రలో భక్తులపై గుడ్లు విసరడం కలకలం రేపుతోంది. ఈ ఘటన కెనడాలో జరిగింది. టొరంటోలో జరిగిన రథయాత్ర ఊరేగింపులో గుర్తు తెలియని వ్యక్తులు భక్తులపై గుడ్లు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. దుండగులు ఈ దాడులతో జాత్యహంకారాన్ని ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. టొరంటో వీధుల్లో భక్తులు భక్తి గీతాలు పాడుతూ రథయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సమీపంలోని భవనం నుండి ఎవరో వారిపై గుడ్లు విసిరారు. అయినా భక్తులు మాత్రం యాత్రను కొనసాగించారు. రథయాత్రలో పాల్గొన్నప్పుడు ఏ ద్వేషం తమను కదిలించదు అని భక్తులు చెప్పడం గమనార్హం. ‘‘ఒక్కసారిగా గుడ్లు మాపై పడడంతో ఆశ్చర్యపోయాం. ఎందుకు విసురుతున్నారో అర్థం కాలేదు. కానీ మేం ఆగిపోలేదు. ఎందుకంటే ద్వేషం ఎప్పుడూ విశ్వాసాన్ని అధిగమించదు. ఏ ద్వేషం మిమ్మల్ని ఆపదు’’ అని ఓ ఎన్ఆర్ఐ భక్తుడు అన్నారు.

ఈ సంఘటనపై ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ ఘటనపై దేశం తరఫున బలమైన నిరసన తెలపాలని విదేశాంగ శాఖను కోరారు. ‘‘రథయాత్రలో భక్తులపై కోడిగుడ్లు విసిరిన వార్త విని చాలా బాధపడ్డాను. ఇటువంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్నాథ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తుంది. ఈ ఘటన లోతైన భావోద్వేగ, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఒడిశా ప్రజలకు తీవ్ర వేదనను కలిగిస్తుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి’’ అని పట్నాయక్ అన్నారు. ఈ ఘటన ఇస్కాన్ యొక్క 53వ వార్షిక రథయాత్ర సందర్భంగా జరిగింది.