
డాక్టర్ వివేక్ లాల్.. నాసా నుంచి నాటో వరకు ఎన్నో పదవులను చేపట్టారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 20వ శతాబ్దపు అత్యుత్తమ 2000 మంది శాస్త్రవేత్తలలో లాల్ ఒకరిగా నిలిచారు. భారత్ – అమెరికా రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయనది కీలక పాత్ర. అంతేకాకుండా అంతర్జాతీయంగా వివిధ సంస్థలలో ఉన్నత పదవులు చేపట్టారు. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో ఉన్న డాక్టర్ లాల్‌కు చెందిన జనరల్ అటామిక్స్ గ్లోబల్ కార్పొరేషన్, 5 ఖండాలలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రిడేటర్, రీపర్, గార్డియన్ వంటి అత్యాధునిక డ్రోన్స్‌ను తయారు చేస్తుంది. ఎలక్ట్రో-ఆప్టికల్, రాడార్, సిగ్నల్స్ ఇంటెలిజెన్స్, స్వయంచాలిత వైమానిక నిఘా వ్యవస్థలను కూడా అందిస్తుంది. జనరల్ అటామిక్స్, థర్మోన్యూక్లియర్ ఫ్యూజన్ పరిశోధనలో ఒక ప్రైవేట్ రంగ భాగస్వామిగానూ, అలాగే తరువాతి తరం అణు విచ్ఛిత్తి, అధిక-ఉష్ణోగ్రత పదార్థాల సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో అగ్రగామిగానూ నిలుస్తోంది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జనరల్ అటామిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రముఖ ఇండో అమెరికన్ డాక్టర్ అయిన వివేక్ లాల్.. ఇటీవలే ప్రతిష్ఠాత్మక స్పేస్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లో నాన్-రెసిడెంట్ స్కాలర్‌గా చేరారు. ఈ నియామకంతో అధునాతన అంతరిక్ష సాంకేతికతలు, అంతర్జాతీయ రక్షణ విధానాలపై ఆయనకున్న లోతైన అనుభవాన్ని, నైపుణ్యాలను పంచుకోనున్నారు. ‘‘అంతర్జాతీయ రక్షణ సహకారాలను పెంపొందించడంలో ఆయన అనుభవం అపారమైనది. డ్రోన్‌ల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ నైపుణ్యాలు అంతరిక్ష పాలన, సైనిక అనువర్తనాల భవిష్యత్తుపై మాకు విలువైన సూచనలు ఇస్తారు’’ అని స్పేస్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. డాక్టర్ లాల్‌తో కలిసి పనిచేయడం ద్వారా ‘‘అంతరిక్ష విధానం, భద్రతలో ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడానికి, భవిష్యత్తు కోసం వ్యూహాలను రూపొందించడంలో ఆయన సహకారాలను ఆశిస్తున్నామని ఎస్పీఐ తెలిపింది.
డాక్టర్ లాల్ తన అపారమైన అనుభవంతో అనేక అంతర్జాతీయ సంస్థలలో ప్రముఖ పదవులను నిర్వర్తించారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని ప్రతిష్టాత్మక హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌లో విజిటింగ్ ఫెలోగా పనిచేస్తున్నారు. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ బిజినెస్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడుగా ఉన్నారు. వైట్ హౌస్ ప్రకటించిన క్వాడ్ ఇన్వెస్టర్స్ నెట్‌వర్క్ అడ్వైజరీ బోర్డులోనూ లాల్ సభ్యుడు. ఇక నాటో STOకు యునైటెడ్ స్టేట్స్ టెక్నికల్ టీమ్‌లో సభ్యుడిగా పెంటగాన్ నియమించింది.US-ఇండియా బిజినెస్ కౌన్సిల్ గ్లోబల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో కూడా పనిచేశారు. గతంలో ఆయన లాక్‌హీడ్ మార్టిన్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా, జనరల్ అటామిక్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్స్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, బోయింగ్ కంపెనీలో కీలకమైన ఇంజనీరింగ్, మార్కెటింగ్ పాత్రలను నిర్వహించారు. ఆయన రేథియాన్‌లో పనిచేయడంతో పాటు నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్‌లోనూ పరిశోధనలు చేశారు.
డాక్టర్ లాల్ మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లలో డిగ్రీలు, పీహెచ్‌డీ పొందారు. సీటెల్‌లోని సిటీ యూనివర్సిటీ నుండి ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఆయనకు సెప్టెంబర్ 2022లో ప్రెసిడెంట్స్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 20వ శతాబ్దపు అత్యుత్తమ 2000 మంది శాస్త్రవేత్తలలో లాల్ ఒకరిగా నిలిచారు. వందకు పైగా వ్యాసాలు రాసిన ఆయన, అమెరికా గణిత సంఘం అధ్యక్షుడిగానూ పనిచేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..