విమానంలో కుక్క మూత్రం.. పైలట్ విచిత్ర ఆప్షన్ !
విమాన ప్రయాణంలో సాధారణంగా ఆలస్యం, సాంకేతిక సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ అమెరికాలోని ఓ డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికులకు ఎదురైన సమస్య విచిత్రంగా ఉంది. విమానం క్యాబిన్‌లో కుక్క మూత్రం పోయడంతో ప్రయాణికుల ముందు పైలట్ రెండు ఆప్షన్లు ఉంచారు. అందులో ఏది కావాలో చేతులెత్తి చెప్పాలని కోరారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

విమాన ప్రయాణాలలో సాధారణంగా ఆలస్యం, సాంకేతిక సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ అమెరికాలోని ఓ డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికులకు ఎదురైన సమస్య విచిత్రంగా ఉంది. విమానం క్యాబిన్‌లో కుక్క మూత్రం పోయడంతో ప్రయాణికుల ముందు పైలట్ రెండు ఆప్షన్లు ఉంచారు. అందులో ఏది కావాలో చేతులెత్తి చెప్పాలని కోరారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కుక్క విమానం క్యాబిన్‌లో మూత్ర విసర్జన చేసినట్లు పైలట్ ప్రయాణికులకు వివరించారు. దీంతో విమానంలో దుర్వాసన వస్తోందని సమస్యను పరిష్కరించడానికి రెండు మార్గాలు ఉన్నాయని తెలిపారు.
మొదటి ఆప్షన్ ప్రకారం.. విమానాన్ని పూర్తిగా శుభ్రం చేయించవచ్చు. అయితే ఇందుకు కొంత సమయం పడుతుంది. విమానం బయలుదేరడం ఆలస్యమవుతుంది. రెండో ఆప్షన్ ప్రకారం శుభ్రపరిచే పనులు చేయకుండానే షెడ్యూల్ ప్రకారమే విమానాన్ని టేకాఫ్ చేయడం. అయితే ప్రయాణికులు కుక్క మూత్రం వాసన భరిస్తూ ప్రయాణించాల్సి ఉంటుంది.
ఈ రెండు ఆప్షన్లలో ఏది కావాలో ప్రయాణికులు చేతులెత్తి ఓటు వేయాలని పైలట్ కోరారు. అంటే ఆలస్యంగా అయినా శుభ్రం చేసిన విమానంలో వెళతారా? లేక దుర్వాసన భరిస్తూ సమయానికి ఇంటికి చేరుకుంటారా అని అడిగారు. విచిత్రమైన ఓటింగ్‌ను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా వీడియో
టెలివిజన్ హోస్ట్ జెన్నిఫర్ కాఫీ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను ఆ విమానంలో ప్రయాణించలేదని ఆమె స్పష్టం చేశారు. లా గార్డియా విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ గేట్ వద్ద ప్రయాణికులు పైలట్ ప్రశ్నకు చేతులెత్తి సమాధానం చెబుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.
ఈ వీడియోను విమానయాన రంగానికి సంబంధించిన వెబ్‌సైట్ ‘వ్యూ ఫ్రమ్ ది వింగ్’ ప్రస్తావించింది. ఆన్‌లైన్‌లో వీడియోకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ప్రయాణికులు ఏ ఆప్షన్‌కు ఎక్కువగా ఓటు వేశారు? చివరకు విమానాన్ని శుభ్రం చేశారా? లేక షెడ్యూల్ ప్రకారమే బయలుదేరిందా? అనే విషయాలపై స్పష్టత లేదు.
View this post on Instagram
కుక్కలతో ప్రయాణంపై నెటిజన్ల మధ్య చర్చ
విమానాల్లో పెంపుడు జంతువులను అనుమతించాలా? వద్దా? అనే అంశంపై నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేసారు. కుక్కల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురైనా పర్వాలేదని కొందరు కామెంట్లు పెట్టారు. విమానంలో మనుషుల కంటే కుక్కలతో ప్రయాణించడానికే ఇష్టపడతామని ఒకరు సరదాగా కామెంట్ చేశారు. మరో నెటిజన్ అయితే విమానం త్వరగా బయలుదేరేందుకు ఎవరో ఒకరు క్లీనింగ్ సామగ్రి తీసుకొచ్చి శుభ్రం చేయడానికి ముందుకొస్తారని జోక్ చేశారు. ఓ నర్సు, తరచూ విమాన ప్రయాణాలు చేసే వ్యక్తి కూడా పెంపుడు జంతువులకు మద్దతుగా మాట్లాడారు. విమానాల్లో ప్రయాణికుల వల్ల కూడా మురికి, శరీర ద్రవాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతుంటాయని గుర్తుచేశారు.
అయితే మరికొందరు మాత్రం విమానాల్లో పెంపుడు జంతువులను అనుమతించకూడదని అభిప్రాయపడ్డారు. కేవలం శిక్షణ పొందిన సర్వీస్ యానిమల్స్‌కు మాత్రమే అనుమతి ఇవ్వాలని సూచించారు. మొత్తానికి ఓ కుక్క చేసిన చిన్న పని.. విమాన ప్రయాణంలో పెంపుడు జంతువుల అనుమతిపై పెద్ద చర్చకు దారితీసింది.