ఇంట్లో పిల్లలు, పెద్దలు ఏదైనా ఇష్టంగా జంక్ ఫుడ్ తినాలని కోరుకుంటే చాలా మంది మొదటి ఎంపిక ఇన్‌స్టంట్ నూడుల్స్. అయితే ఇటీవల డెన్మార్క్ ఫుడ్ అథారిటీ దక్షిణ కొరియాలో తయారైన నూడుల్స్‌ను నిషేధించింది. నిషేధంతో పాటు ఆ నూడుల్స్‌ను ఇష్టపడి తినే వారికి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఫుడ్ అథారిటీ ప్రకారం ఈ నూడుల్స్ చాలా స్పైసిగా ఉంటాయి. అవి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే విషంగా పనిచేస్తాయని వెల్లడించింది.
దక్షిణ కొరియాలో ఉత్పత్తి అయ్యే మూడు రకాల నూడుల్స్‌పై డెన్మార్క్ ఫుడ్ అథారిటీ నిషేధం విధించింది. ఈ మూడు స్పైసీ నూడుల్స్ చాలా స్పైసీగా ఉంటాయని అవి ఎవరి శరీరంలోనైనా విషంలా పనిచేస్తాయని అంటున్నారు. ఈ మూడు నూడుల్స్‌ను దక్షిణ కొరియాలోని అతిపెద్ద నూడుల్స్ తయారీ సంస్థ సమ్యాంగ్ ఫుడ్స్ తయారు చేస్తోంది. ఈ కంపెనీకి చెందిన నూడుల్స్ ప్రపంచంలోని ప్రతి మూలకు పంపిణీ చేయబడుతున్నాయి.
నిషేధించబడిన నూడుల్స్‌లో బుల్డక్ సమ్యాంగ్ 3 x స్పైసీ అండ్ హాట్ చికెన్, బుల్డక్ సమ్యాంగ్ 2 x స్పైసీ అండ్ హాట్ చికెన్, బుల్డక్ సమ్యాంగ్ హాట్ చికెన్ స్టీ ఉన్నాయి. డానిష్ వెటర్నరీ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ ఈ నూడుల్స్‌లో అధిక మొత్తంలో క్యాప్సైసిన్ అనే రసాయన ఉత్పత్తి ఉందని.. ఈ రసాయనం ఎర్ర మిరపకాయ రుచిని ఇస్తుందని వెల్లడించింది. ఈ రసాయనాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కనుక ఈ క్యాప్సైసిన్ అధికంగా ఉన్న ఈ మూడు నూడుల్స్ ను తినోద్దని వెల్లడించింది. వాస్తవానికి ఈ కంపెనీ కి చెందిన ఈ నూడుల్స్‌కు ఆదరణ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉందని.. మార్కెట్ కూడా చాలా పెద్దదని అయితే ఇక నుంచి డెన్మార్క్‌లో ఈ నూడుల్స్‌ను విక్రయించబోమని, ఎందుకంటే ఇది పెద్దలకు , పిల్లలకు హానికరం అని డెన్మార్క్ అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ నూడుల్స్ ఇప్పటికీ ఎవరి వద్దనైనా స్టాక్ ఉంటే.. వారు ఎక్కడ నుంచి వాటిని ఖరీదు చేసారో వారికీ అందించమని సూచిస్తోంది. ఈ కంపెనీకి చెందిన రకరకాల నూడుల్స్ తమ దేశానికి దిగుమతి అవుతున్నాయని ఆయన చెప్పారు. అయితే ఈ నూడుల్స్ అన్ని వయసుల పిల్లలకు, వృద్ధులకు ప్రమాదకరమని డానిష్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన హెన్రిక్ డామండ్ తెలిపారు. Samyang Foods Company ఏడాది ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఈ సంస్థకి చెందిన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. గత ఏడాది ఈ కంపెనీ 110 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించింది.
తమ నూడుల్స్‌పై నిషేధంపై కంపెనీ కూడా స్పందించింది. స్పైసీగా ఉండటంతో తొలిసారిగా తమ ఉత్పత్తులను నిషేధించారని Samyang Foods Company తెలిపింది. అంతేకాదు ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలు స్పైసీ ఫుడ్ ని తినడానికి ఇష్టపడుతున్నారు.. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పైసీ ఫుడ్ తినమని ఒకరినొకరు సవాలు చేసుకుంటూనే ఉన్నారని వెల్లడించింది. అయినప్పటికీ తమ ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం కావంటూ కంపెనీ తెలిపింది.
మరోవైపు డెన్మార్క్ అథారిటీ ఈ నూడుల్స్ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు దీన్ని తినకూడదని హెచ్చరించింది. డెన్మార్క్‌లో విధించిన ఈ నిషేధం సోషల్ మీడియాలో ప్రజలకు చర్చనీయాంశంగా మారింది. డెన్మార్క్‌లో నివసించే ప్రజలు స్పైసీ ఫుడ్ తినే సామర్థ్యం అతి తక్కువ అని కొందరు చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..