దోమల నియంత్రణకు మన దేశంలో అధికంగా చేసే పని ఫాగింగ్.. ఒక యంత్రం సాయంతో వీధి వీధిని ఒక రకమైన పొగతో నింపేస్తుంటారు. అయితే అది నిజంగా దోమలను నివారిస్తుందా? కచ్చితంగా అవునని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. సాధారణ దోమలనైతే కాస్త అదుపు చేయగల్గుతుందని కానీ.. డెంగ్యూ వంటి వ్యాధి కలుగజేసే దోమలు మన వాళ్లు చేసే ఫాగింగ్ ను తట్టుకొని బతికేస్తాయని వివరిస్తున్నారు. ఇప్పుడు ఫాగింగ్ కు మించిన మరో ప్రత్యామ్నాయం దోమల నియంత్రణకు అవసరమని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.
డెంగ్యూని వ్యాప్తి చెందించే దోమలు ఏడెస్ ఈజిప్టి, ఏడెస్ ఆల్బోపిక్టస్. ఒకే జాతికి చెందిన ఈ దోమలు మరింతగా బలోపేతం అయ్యాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా దోమల నియంత్రణకు చేసే ఫాగింగ్ లకు ఇవి తట్టుకునే విధంగా పరివర్తన చెందాయిన సూచిస్తున్నారు. ఇది విస్తృతమైన అంటువ్యాధులకు కూడా కారణం కాగలదని హెచ్చరిస్తున్నారు. వాస్తవంగా మలేసియాలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అక్కడ జనాభాను సంరక్షించేందుకు ప్రభుత్వం క్రిమిసంహారక మందులను అధికంగా ఉపయోగిస్తోంది. ఇలాంటి చర్యలు కూడా ఆ దోమల్లో నిరోధకత పెరగడానికి కారణమై ఉండొచ్చని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి నియంత్రణకు మరిన్ని కొత్త పరిష్కార మార్గాలు వెతకాలి అని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఒక చోట డెంగ్యూ కేసు నమోదైంది అంటే మన ప్రభుత్వాలు అప్రమత్తమై అక్కడ పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు తీసుకుంటాయి. అలాగే దోమల నియంత్రణకు ఫాగింగ్ చేస్తాయి. అయితే ఫాగింగ్ కారణంగా పెద్ద దోమలు చనిపోయే అవకాశం ఉంటుంది గానీ.. దోమల లార్వా చనిపోదని నిపుణులు చెబుతున్నారు. పైగా డెంగ్యూ ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది ఎంత మాత్రం సరిపోదని వివరిస్తున్నారు. దోమల ఫాగింగ్ అనేది కేవలం స్పల్పకాలిక చర్యే గానీ పూర్తి స్థాయి లక్ష్యాలను అందుకోదని తేల్చి చెబుతున్నారు. పైగా ఈ ఫాగింగ్ లో వాడే క్రిమ సంహారక మందులు కారణంగా ఆ ప్రాంతంలో గాలి కలుషితమవుతుందని వివరిస్తున్నారు.
అయితే మరి డెంగ్యూ దోమల నియంత్రణకు ఈడెస్ దోమల సంతానోత్పత్తిని నాశనం చేయడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అలాగే లార్విసైడ్ లను ఉపయోగిస్తే.. అవి ఈడెస్ దోమలపై మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయని వివరిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..