కరాచీ, డిసెంబర్ 18: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు వార్తకథనాలు వెలువడుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అతనిపై విష ప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లనే గత రెండు రోజులుగా వైద్య సంరక్షణలో ఉన్నాడని తెలుస్తోంది. దావూద్ ఆరోగ్యంపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ విషయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం అడ్మిట్ అయిన ఫ్లోర్‌లో కట్టు దిట్టమైన సెక్యురిటీ మధ్య అతనొక్కడికే వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రి అధికారులు, అతని కుటుంబ సభ్యులు మినహా మరెవ్వరినీ ఆస్పత్రిలోకి అనుమతివ్వడం లేదు. దీంతో దావూద్ ఆరోగ్యం చుట్టూ నెలకొన్న గోప్యత, అతను ఆస్పత్రి పాలవ్వడానికి దారితీసిన పరిస్థితిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దావూద్ ఆస్పత్రిలో చేరడంపై ముంబై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని బంధువులైన అలీషా పర్కర్, సజ్జిద్ వాగ్లే ద్వారా మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఏడాది జనవరిలో అండర్‌వరల్డ్ డాన్ దావూద్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని అతని సోదరి హసీనా పార్కర్ కుమారుడు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి వెల్లడించాడు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులను నిర్భందించేందుకు పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో పేర్కొంది.
డిసెంబర్ 26, 1955న జన్మించిన దావూద్ ఇబ్రహీం ప్రస్తుత వయసు 67 ఏళ్లు. ఇన్‌ఫేమస్ D-కంపెనీకి అతను అధిపతి. అతని క్రిమినల్ సిండికేట్ ఇప్పటికీ భారత్‌లో యాక్టివ్‌గా ఉంది. ముఖ్యంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్, నకిలీల వస్తువుల తయారీ వంటి అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ముంబై కేంద్రంగా చురుగ్గా పనిచేస్తోంది. అల్-ఖైదాతో సహా గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూపులతో D-కంపెనీకి సత్సంబంధాలు ఉన్నట్లు గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (GTI) పేర్కొంది. 1993 ముంబై వరుస పేలుళ్లతో సహా పలు నేరాల కింద భారత ప్రభుత్వం అతని కోసం గాలిస్తోంది. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో నివసిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇస్లామాబాద్ ఎన్నో ఎళ్లుగా దాచినా ఇటీవల అంగీకరించింది. పాకిస్తాన్ జాతీయ గూఢచార సంస్థ కమాండోలు కరాచీలో అతనికి భద్రతను కల్పిస్తున్నట్లు తెల్పింది. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలు ఎంత వరకు నిజం అనేదానిపై భారత నిషా సంస్థలు దృష్టి నిలిపాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.