అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను మంచు తుపాను కుదిపేసింది. పెద్ద ఎత్తున కురిసిన మంచు.. రోడ్లను, ఇళ్లను కప్పివేసింది. ఈ తుఫాను కారణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా తూర్పు తీరానికి జనం భారీగా చేరుకుంటున్నారు. దీంతో మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లో తూర్పు – మధ్య అమెరికా ద్వారా ప్రయాణించేవారు జాగ్రత్త తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు క్రిస్మస్ పండుగు పురస్కరించుకుని సహాయక చర్యలు చేసి రవాణా వ్యవస్థను పునరుద్దరిస్తున్నారు అధికారులు.
ఈ సీజన్ లో శీతల గాలుల ప్రభావం అమెరికాపై బాగానే కనిపిస్తోంది. ఈ వారంలో వచ్చే క్రిస్మస్ పండుగపై కొత్త తుఫాను ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. శనివారం తూర్పు అమెరికా నుంచి వీస్తున్న చల్లటి గాలులతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఓహియో నగరం నుండి న్యూయార్క్ వరకు మంచు దుప్పటి కప్పేసింది. ఆదివారం I-95 కారిడార్‌కు మంచు జల్లులు కురుస్తాయని అక్కడి వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో ప్రజలు మంచుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెనడాను మంచు తుఫాన్ వణికిస్తోంది. అటు ఎగువ మిడ్వెస్ట్కు మంచు భారీగా కురుస్తోంది.
మరోవైపు, మిన్నెసోటా నుంచి వర్జీనియా వరకు మొత్తం 12 రాష్ట్రాలు ఈ తుపాను బీభత్సానికి గురయ్యాయని సమాచారం. మోంటానాలో 2 అడుగుల మేర మంచు కప్పేసింది. ఇక నార్త్ డకోటాలో 15 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయిందని తెలుస్తోంది. కాగా, అత్యధిక జనాభా కలిగిన నగరం చికాగోలో గంటకు ఓ అంగుళం చొప్పున మంచు కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం తుపాను బాధిత ప్రాంతాల్లో అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.
అటు వాయువ్య ప్రాంతంలో మంచు తుఫాను భారీ వర్షాన్ని కురిపిస్తోంది. ఒరెగాన్, వాషింగ్టన్ వంటి ప్రాంతాల్లో 8 అంగుళాల వరకు మంచుతో కూడిన వర్షం పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బురదజల్లులు, కొండచరియలు, హిమపాతాలను రేకెత్తిస్తుందని, కొన్ని చోట్ల వరదలు కూడా సంభవించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచు అల్ప పీడనం ఏర్పడి తుఫాన్ గా మారే అవకాశముంది. దీనివల్ల ఎగువ మిడ్‌వెస్ట్ భాగాలలో మంచు విస్ఫోటనం చెందుతుందని అధికారులు వెల్లడించారు.