మొన్నటి దాకా జనాభా ఎక్కువై ఇబ్బందులు పడ్డ చైనా.. ఇప్పుడు అదే జనాభా కోసం తాపత్రయపడుతోంది. ఒక్కసారిగా పడిపోయిన జననాల రేటును పెంచేందుకు.. ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. విద్యార్ధులు, యువతకు భారీ ఆఫర్లు ఇస్తోంది డ్రాగన్ కంట్రీ. జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం చైనా. 2021 నాటికే ఆ దేశ జనాభా 141 కోట్లకు పైగా ఉన్నారు. అయినప్పటికీ ఆ దేశం కొన్ని వినూత్న సమస్యలను ఎదుర్కొంటోంది. అందులో ఒకటి.. యువత శాతం తగ్గిపోవడం. రెండోది.. జనాభా పెరుగుదల శాతం భారీగా పడిపోవడం. చైనాలో ప్రస్తుతం జనాభా పెరుగుదల రేటు కేవలం 0.1శాతం మాత్రమే.
ఒక్కరే ముద్దు.. ఇద్దరు వద్దు అనే కండీషన్ కారణంగా ఆ దేశం ఊహించని సమస్యను కొని తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన డ్రాగన్.. పిల్లలు కనే విషయంలో సడలింపులు ఇచ్చింది. ఇద్దరు, ముగ్గురిని అయినా కనండి అంటూ ఆఫర్లు ప్రకటించింది. అయినప్పటికీ పెద్దగా మార్పు రాలేదు. గడిచిన ఐదేళ్లుగా జనాభా వృద్ధి రేటు పడిపోతూనే ఉంది. 61 ఏళ్ల తర్వాత తొలిసారి చైనా జనాభా వృద్ధిలో ప్రతికూలత నమోదైంది. ఇలాంటి సమయంలో పుట్టిందే స్పెర్మ్ బ్యాంక్ కాన్సెప్ట్.
గ్రాఫిక్స్
వీర్యాన్ని దానం చేయాలంటూ యూనివర్సిటీ విద్యార్థులను చైనా స్పెర్మ్ బ్యాంకులు కోరుతున్నాయి. ఫిబ్రవరి 2న నైరుతి చైనాలోని యునాన్ హ్యూమన్ స్పెర్మ్ బ్యాంక్ తొలిసారి దీనిపై ప్రకటన ఇచ్చింది. స్పెర్మ్ డొనేషన్ విధానం, రిజిస్ట్రేషన్ షరతులు, చెల్లించే ఫీజు గురించి అందులో స్పష్టంగా వివరించింది. 20 నుంచి 40 ఏళ్ల వయసు, 165 సెంటీమీటర్ల కంటే ఎత్తుగా ఉండి, డిగ్రీ పూర్తైన, లేదంటే చదువుతున్న ఆరోగ్యవంతులైన వారు దీనికి అర్హులు. స్పెర్మ్ దాతలు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి. అలాంటి వారు 8 నుంచి 12 సార్లు వీర్యం దానం చేస్తే 4,500 యూవాన్లు.. అంటే మన కరెన్సీలో 55వేల రూపాయలు ఇస్తారు.
షాంగ్జీ స్పెర్మ్ బ్యాంక్ కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటించింది. వీర్య దాతలు కనీసం 168 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలని తెలిపింది. వారికి 5,000 యూవాన్లు చెల్లిస్తామని చెప్పింది. షాంఘై స్పెర్మ్ బ్యాంక్ ఇంకాస్త ఎక్కువ రేటే ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఒక్కో దాతకు 7,000 యువాన్లను ఇస్తామంటోంది. అయితే బట్టతల, దృష్టి లోపం, బీపీ వంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు. స్మోకింగ్, మద్యం సేవించే అలవాట్లు లేనివారే అర్హులు. ఇలా చైనాలోని అన్ని స్పెర్మ్ బ్యాంకులు యూనివర్సిటీ విద్యార్థులకు ఆఫర్లు ఇస్తున్నాయి. దీంతో స్పెర్మ్ ఇచ్చేందుకు విద్యార్ధులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..