Chinese Genetic Bioweapon: కరోనా.. పుట్టి, పెరిగింది చైనాలో. ఆ దేశంలోనే వేలాది మంది ప్రాణాలు తీసిన ఆ మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరించింది. కోట్లాది మంది రాకాసి వైరస్ బారినపడగా, లక్షలాది మంది ప్రాణాలను హరించింది. యావత్తు ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. అయితే, ఖండాలకు విస్తరించిన ఈ వైరస్ వ్యాప్తి.. చైనాలో మాత్రం తగ్గుముఖం పట్టింది. కానీ, 140 దేశాల్లో పంజా విసురుతోంది. అయితే.. ఈ వైరస్ వ్యాప్తి వెనుక చైనా కుతంత్రమే దాగి ఉందని అంటున్నారు కొందరు నిపుణులు. ఆ కుతంత్రమే.. బయో ఆయుధం అని చెబుతున్నారు. చైనా బయో వార్‌కు దిగిందని అస్ట్రేలియాకు చెందిన మీడియా కథనం వెలువరించింది. వాస్తవానికి కరోనా వైరస్ ఎలా పుట్టింది? ఎలా బయటికి వచ్చింది? అనే ప్రశ్నలు ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి. ఓ మాంస విక్రయశాల నుంచి వచ్చిందని, పాముల నుంచి సోకిందని, గబ్బిలాల వల్లే వ్యాప్తి చెందిందని.. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, కచ్చితమైన ఆధారం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే.
ఎప్పుడు మొదలైంది…
ఇదిలావుంటే, కరోనా వైరస్‌తో ఆయుధాలను తయారు చేయడంపై 2015లోనే చైనా శాస్త్రవేత్తలు చర్చించినట్లు తెలుస్తోంది. సార్స్ కరోనా వైరస్‌లు నూతన శకం జీవాయుధాలుగా మార్చాలని ఫ్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే మనుషుల్లో వ్యాధికారక వైరస్‌లోకి దీనిని కృత్రిమంగా చొప్పించి ఆయుధాలుగా మలచుకోవచ్చని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసినట్లు ‘ది ఆస్ట్రేలియన్’ కథనం వెలువరించింది. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అది జీవాయుధాలతోనే అని చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు ఒక లేఖలో రాసినట్లు పేర్కొంది. సార్స్ కరోనా వైరస్‌లను నూతన శకం జన్యు ఆయుధాలుగా డ్రాగన్ అభివర్ణిస్తోన్నట్లు తెలిపింది. జీవాయుధంతో దాడి చేస్తే శత్రుదేశం వైద్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని చైనా సైన్యం పేర్కొంటోంది.
The mentioned breaking document to “predict World War III as biological war” is the PLA’s novel bioweapon textbook (by General Dezhong Xi, 2015) I’m translating into English with our Chinese volunteers! The brief introduction is in the 3rd Yan Report?? https://t.co/BxE22sQOuN pic.twitter.com/qkx7cLKclt
— Dr. Li-Meng YAN (@DrLiMengYAN1) May 7, 2021
ఎలా బయటపడింది…
కరోనా మహమ్మారి 2019లో విరుచుకుపడినప్పటికీ చైనా సైన్యానికి చెందిన శాస్త్రవేత్తలు ఇలాంటి వైరస్‌తో ఆయుధాల తయారీ గురించి ఐదేళ్ల క్రితం నుంచే చర్చిస్తూ వచ్చినట్లు ‘ది ఆస్ట్రేలియన్’ తెలిపింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు లభ్యమైనట్లు మరికొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. కోవిడ్-19పై దర్యాప్తులో భాగంగా అమెరికా అధికారులకు ఈ పత్రాలు చేజిక్కినట్లు తెలిపాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) కమాండర్లు ఎలాంటి ఘాతుకాలకు పాల్పడతారో ఇవి రుజువు చేస్తున్నాయని యూకే నుంచి వెలువడే ‘ద సన్’ పేర్కొంది. వుహాన్ వైరస్ వెనక రహస్యాలను వెల్లడించేలా త్వరలో ఒక పుస్తకాన్ని ప్రచురిస్తున్నట్లు తెలిపింది.
నిపుణులు ఏమంటున్నారు…
భిన్న రకాల వైరస్‌లను సైనిక అవసరాలకు ఎలా వాడుకోవచ్చనేది శాస్త్రవేత్తలు ఆలోచిస్తుండడం స్పష్టమని ‘ఆస్ట్రేలియా వ్యూహాత్మక విధానాల సంస్థ’ (ఏఎస్‌పీఐ) ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పీటర్ జెన్నింగ్స్ వ్యాఖ్యానించారు. సైనిక అవసరాలకు ఉద్దేశించిన రోగకారక అణువు ప్రమాదవశాత్తూ బయటకు విడుదలైందన్న వాదనను బలపరిచేలా ఇది ఉందని చెప్పారు. ‘వుహాన్ మార్కెట్ నుంచి వైరస్ బయటకు వచ్చినట్లయితే దానిపై దర్యాప్తు నిమిత్తం ఇతర దేశాల నుంచి వస్తామన్నవారికి చైనా సహకరించి ఉండేది. కానీ, వైరస్ మూలాల్లోకి వెళ్లాలన్న ప్రయత్నాన్ని డ్రాగన్ వ్యతిరేకించింది’ అని ఆయన గుర్తుచేశారు. చైనా ప్రభుత్వ డాక్యుమెంట్స్ లీకైనప్పుడు అవి సరైనవో కాదో తేల్చిచెప్పే సైబర్ భద్రత నిపుణుడు రాబర్ట్ పోటర్ ఇదే అంశానికి సంబంధించి స్పందించారు. తాజా పత్రం నకిలీది కాదని తేల్చడం గమనార్హమన్నారు. చైనా పరిశోధకులు ఏం ఆలోచిస్తున్నారనేది ఈ రికార్డుల్లో చెబుతోందన్నారు. చైనా మాత్రం ఇది తమపై బురదజల్లే ప్రయత్నమని తోసిపుచ్చింది.
ఇజ్రాయెల్ నిపుణులు అనుమానాలు ఏంటీ..?
అయితే.. ఈ వైరస్ వ్యాప్తి వెనుక చైనా కుతంత్రమే దాగి ఉందని.. బయో ఆయుధంతో బయో వార్‌కు దిగిందని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ నిపుణుడు సైతం గతంలోనే స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన బయోలాజికల్ వార్‌ఫేర్ ఎక్స్‌పర్ట్ డేనీ షోహామ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఏ నగరం నుంచైతే కరోనా వ్యాప్తి చెందిందో అక్కడే చైనా బయో వెపన్స్ తయారు చేస్తోంది. ఆ నగరమే.. వుహాన్. అక్కడి నుంచే ఈ వైరస్ ప్రపంచానికి వ్యాప్తి చెందింది. ఆ నగరంలో వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనే ల్యాబ్ ఉంది. అక్కడ వైరస్‌లపై పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. సార్స్, ఇతర వైరస్‌ల నమూనాలు ఇక్కడ భద్రపరిచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిఫరెన్స్‌గా ఇది పనిచేస్తుంది. అయితే, చైనా దీన్ని స్వప్రయోజనాలు పొందేందుకు వాడుతోందని ఆ నిపుణుడు తెలిపాడు. ఎబోలా, నిఫా, సార్స్ వంటి ప్రాణాంతక వైరస్‌లు ఇక్కడ భద్రపరిచారని చెప్పాడు. ఆ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను అభివృద్ధి చేశారని, అయితే.. ప్రమాదవశాత్తు ఆ వైరస్ బయటికి వచ్చి ఆ దేశాన్నే కాటేసిందని కూడా ఆయన స్పష్టం చేశాడు.
జీవా ఆయుధం అంటే ఏంటీ..?
బయో వెపన్ అంటే ఏంటంటే.. కొత్త వైరస్‌ను సృష్టించి, దీంతో వ్యాధులను వ్యాప్తి చేయడం. ఉదాహరణకు.. ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేయాల్సి వస్తే ఆ దేశం నేరుగా యుద్ధ రంగంలోకి దిగకుండా, బయో వెపన్‌ను వాడుతుంది. వివరంగా చెప్పాలంటే.. ఒక వ్యక్తిలోకి వైరస్‌ను ఎక్కించి శత్రుదేశంలోకి పంపిస్తారు. ఆ వైరస్ శత్రుదేశంలోని ప్రజలకు సోకి వ్యాధిబారిన పడేస్తుంది. దీంతో ఆ శత్రుదేశం ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా బలహీనపడిపోతుంది. తద్వారా యుద్ధం చేయలేని స్థితిలో లొంగిపోతుంది. ఇదీ.. బయో వెపన్ తయారు చేయడానికి అసలు కారణం.