
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై భారీ సుంకాలు విధించడంతో.. చైనా, ఇండియాను సాయం కోరింది. అమెరికా విధించిన సుంకాలకు వ్యతిరేకంగా కలిసి నిలబడాలని కోరింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు హాని కలిగించే విధంగా అమెరికా సుంకాలు ఉన్నాయని పేర్కొంది. ఇండియాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్, ఇండియా-చైనా వాణిజ్య సంబంధాన్ని ‘పరస్పర ప్రయోజనకరంగా’ అభివర్ణించారు, అమెరికా సుంకాల నేపథ్యంలో ‘ఇబ్బందులను అధిగమించడానికి కలిసి నిలబడాలని’ ఇండియాను కోరుతూ.. ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఆ పోస్ట్‌లో చైనా- ఇండియా ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనంపై ఆధారపడి ఉంటాయి. గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధి హక్కును కోల్పోయే అమెరికా సుంకాల దుర్వినియోగాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, రెండు అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇబ్బందులను అధిగమించడానికి కలిసి నిలబడాలి” అని రాసుకొచ్చారు.
భారత్-చైనా వాణిజ్య సంబంధాలు
2024 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 101.73 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో చైనా భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే, భారతదేశం చైనాకు ఎగుమతి చేసే దానికంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది. పాలసీ సర్కిల్ నివేదిక ప్రకారం.. పునరుత్పాదక ఇంధన భాగాలు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులు ఇందులో అధికం. 2024 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 85.06 బిలియన్ డాలర్లకు పెరిగింది. మంగళవారం ప్రెసిడెంట్ ట్రంప్ చైనా వస్తువులపై అదనంగా 50 శాతం సుంకాలు పెంచడతో.. మొత్తంగా చైనాపై 104 శాతం సుంకాలు విధించినట్లు అయింది. అలాగే ఇండియాపై 26 శాతం సుంకాలు విధించడం గమనార్హం. వాషింగ్టన్ గతంలో విధించిన లెవీలకు ప్రతిస్పందనగా బీజింగ్ 34 శాతం ప్రతీకార సుంకాన్ని అమలు చేసిన తర్వాత ట్రంప్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ విధించిన సుంకాలకు చైనా ఎందుకంత భయపడుతోంది..?
అమెరికాతో వాణిజ్యంలో చైనా భారీగా లాభపడుతుంది. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం గణాంకాల ప్రకారం.. 2024లో చైనా-అమెరికా మొత్తం వస్తువుల వ్యాపార విలువ 582.4 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. చైనాకు అమెరికా వస్తువుల ఎగుమతుల విలువ 143.5 బిలియన్ డాలర్లు కాగా, 2024లో చైనా నుండి అమెరికా దిగుమతి చేసుకున్న మొత్తం 438.9 బిలియన్ డాలర్లు. అమెరికాకు వస్తువులు ఎగమతి చేస్తూ.. చైనా భారీ ఆర్జిస్తోంది. మరి ఈ దిగుమతులపై ఇప్పుడు అమెరికా భారీగా సుంకాలు విధించడంతో చైనాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అందుకే అమెరికాను వాణిజ్య పరంగా ఎదుర్కొవాలి, సుంకాలు తగ్గించే విధంగా అమెరికాపై ఒత్తిడి తీసుకొని రావాలంటే.. మిగతా దేశాల కంటే కూడా చైనాకు ఇండియా అవసరం చాలా ఉంది. మరి ఇప్పటికే మీ సాయం కావాలంటూ చైనా అభ్యర్థించడంతో ప్రధాని మోదీ చైనాకు ఎలాంటి హామీ ఇస్తారో చూడాలి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.