ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి దూకిన అమెరికా.. చైనా, రష్యా ఏం చేయబోతున్నాయి?

అమెరికా ఇరాన్‌పై దాడి చేసింది. అమెరికా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి దూకిన తర్వాత, చైనా-రష్యా ఏమి చేస్తాయనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ఈ దాడిని చైనా అమెరికాను తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు, ఇరాన్‌పై అమెరికా దాడులపై రష్యా ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో సైనిక చర్య తీసుకోవద్దని అమెరికాకు ముందుగానే సూచించింది.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి దూకిన అమెరికా.. చైనా, రష్యా ఏం చేయబోతున్నాయి?
Iran Israel War 1[1]

Updated on: Jun 22, 2025 | 4:52 PM

ఇప్పటిదాకా ఒక్క లెక్క. ఇప్పటి నుంచి ఇంకో లెక్క. అణ్వస్త్ర దేశం ఇరాన్‌కు అమెరికా ఇస్తున్న స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇది. యుద్ధం వద్దు, బిజినెస్‌ ముద్దు అనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, నేరుగా యుద్ధంలోకి దిగారు. ఇరాన్‌ మీదకు అమెరికా బాంబింగ్‌ మొదులు పెట్టింది.

ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి దూకింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ యాక్టివ్ మోడ్‌లో కనిపించారు. అమెరికా ఈ యుద్ధంలోకి దూకవచ్చనే ఊహాగానాలు వరుస ఘటనలు ఊతం ఇస్తున్నాయి. తాజాగా, శనివారం(జూన్ 21) , అమెరికా ఇరాన్‌పై దాడి చేసింది. అమెరికా ఇరాన్‌లోని 3 అణు కేంద్రాలపై బాంబులు వేసింది. ట్రంప్ ఈ చర్య తర్వాత, చైనా, రష్యా ఏమి చేస్తాయనే ప్రశ్న తలెత్తుతుంది.

ఈ దాడి తర్వాత చైనా స్పందన వచ్చింది. ఇరాన్‌పై అమెరికా చర్యను చైనా తీవ్రంగా ఖండించింది. అమెరికా గతంలో చేసిన వ్యూహాత్మక తప్పులను పునరావృతం చేయవచ్చని చైనా హెచ్చరించింది. 2003 ఇరాక్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, మధ్యప్రాచ్యంలో సైనిక జోక్యం తరచుగా ప్రమాదకరమైన ఫలితాలకు దారితీస్తుందని చరిత్ర పదేపదే చూపించిందని ఆ ప్రకటన పేర్కొంది. మధ్యప్రాచ్యంలో శాంతిని కాపాడుకోవడానికి సైనిక చర్య కంటే దౌత్యం, సంభాషణలు మంచివని చైనా స్పష్టం చేసింది.

గతంలో, ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభాన్ని అధ్యక్షుడు ట్రంప్ రెచ్చగొట్టారని చైనా ఆరోపించింది. ఇరాన్-ఇజ్రాయెల్ దాడిని రెచ్చగొట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా చెప్పింది. అధికారిక మీడియా ప్రకారం, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అన్ని పార్టీలను, ముఖ్యంగా ఇజ్రాయెల్‌ను దాడిని ఆపాలని కోరారు.

మరోవైపు, ఇరాన్‌పై అమెరికా దాడులకు రష్యా ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో సైనిక జోక్యానికి వ్యతిరేకంగా అమెరికాకు ఇంతకు ముందుగానే సలహా ఇచ్చింది. గురువారం(జూన్ 19), రష్యా అణుశక్తి సంస్థ ఛైర్మన్ ఇరాన్ బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడి “చెర్నోబిల్ తరహా విపత్తు”కు దారితీయవచ్చని హెచ్చరించారు. వివాదాన్ని పరిష్కరించడానికి పుతిన్ గతంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను ప్రతిపాదించారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతని ప్రతిపాదనను తిరస్కరించారు. మొదట ఉక్రెయిన్‌తో తన మధ్యవర్తిత్వంపై దృష్టి పెట్టాలని అన్నారు.

అయితే, ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు గురైతే, అది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన, ప్రమాదకరమైన పరిణామాలను కలిగిస్తుందని రష్యా ఇంతకుముందు అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలను హెచ్చరించింది. స్కై న్యూస్ ప్రకారం, ఇరాన్ నాయకుడిని తొలగించడానికి చేసే ఏ ప్రయత్నం అయినా మధ్యప్రాచ్యంలో గందరగోళాన్ని సృష్టించి పరిస్థితిని మరింత దిగజార్చగలదని క్రెమ్లిన్ హెచ్చరించింది.

ఇరాన్ పై అమెరికా దాడి తర్వాత, ఈ రెండు దేశాలు ఏమి చేస్తాయనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. వారు ఇరాన్ కు నేరుగా మద్దతు ఇస్తారా? అయితే, ఈ ప్రశ్నపై రెండు దేశాల నుండి అధికారిక ప్రకటన రాలేదు. రెండు దేశాలు ఇరాన్-ఇజ్రాయెల్ లను సంయమనం పాటించమని కోరవచ్చు. కానీ, రష్యా, చైనా నిశ్శబ్దంగా ఇరాన్ కు దౌత్యపరంగా మద్దతు ఇవ్వగలవని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఇప్పుడు రెండు దేశాల భవిష్యత్తు వ్యూహం ఏమిటో చూడాలి..!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..