వామ్మో.. చూయింగ్‌ గమ్‌ తింటే ఇంత డేంజరా? బయటపడ్డ భయంకర నిజాలు

చూయింగ్ గమ్‌లో మైక్రోప్లాస్టిక్స్ ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తాజా పరిశోధనలు వెల్లడించాయి. ప్రతి గ్రాము గమ్‌లో వందల మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్స్ స్థాయి ఎక్కువగా ఉంది. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం చూయింగ్ గమ్ వినియోగాన్ని తగ్గించడం మంచిది.

వామ్మో.. చూయింగ్‌ గమ్‌ తింటే ఇంత డేంజరా? బయటపడ్డ భయంకర నిజాలు
Chewing Gum

Updated on: Apr 03, 2025 | 3:57 PM

చూయింగ్ గమ్‌ ను చాలా మంది నములుతూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా చూయింగ్‌ గమ్‌ కావాలంటూ మారం చేస్తారు. కొంత మంది పెద్ద వాళ్లకు కూడా చూయింగ్‌ గమ్‌ తినడం ఒక అలవాటుగా మారుతుంది. ఊరికే సరదాగా నములుతూ ఉంటారు. ఇలా చూయింగ్ గమ్‌ నమలడం అలవాటు ఉన్న వాళ్ల ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. చూయింగ్‌ గమ్‌ తినే వాళ్లు ప్లాస్టిక్‌ను తింటున్నట్లే అంటున్నారు నిపుణులు. లాస్‌ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఇటీవల చేసిన పరిశోధన ప్రకారం.. చూయింగ్‌ గమ్ నమలడం వల్ల, మీరు తెలియకుండానే కొన్ని వేల మైక్రో ప్లాస్టిక్ ముక్కలను మింగుతున్నట్లు తేలింది. ఈ మైక్రోప్లాస్టిక్‌లు మీ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.

సాధారణంగా చూయింగ్‌ గమ్‌ను చెట్టు రసం నుంచి తయారు చేస్తారు. అవి చాలా సురక్షితం. కానీ, కొన్ని కంపెనీలు తయారు చేస్తున్న చూయింగ్‌ గమ్‌లో మైక్రో ప్లాస్టిక్‌ ఉన్నట్లు శాస్త్రేవేత్తలు కనిపెట్టారు. నేడు చాలా చూయింగ్ గమ్‌లలో ప్లాస్టిక్ సంచులు, జిగురులలో తరచుగా ఉపయోగించే పాలిథిలిన్, పాలీ వినైల్ అసిటేట్ వంటి సింథటిక్ పాలిమర్‌లు ఉంటున్నాయి. ఇలాంటి చూయింగ్‌ గమ్‌లను నమిలినప్పుడు వేలాది చిన్న ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇదే విషయాన్ని గురుగ్రామ్‌లోని ఆర్టెమిస్ హాస్పిటల్‌లోని న్యూరోసర్జరీ అండ్‌ సైబర్‌నైఫ్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్య గుప్తా కూడా చెప్పారు. ఈ సమయంలో గమ్‌లోని మైక్రోప్లాస్టిక్‌లపై అధ్యయనాలు తక్కువగా ఉన్నప్పటికీ, మైక్రోప్లాస్టిక్‌కు గురయ్యే ఇతర వనరుల అధ్యయనాలు మెదడు ఆరోగ్యం ప్రమాదంలో ఉండవచ్చని అధ్యాయానలు సూచిస్తున్నాయి.

మైక్రోప్లాస్టిక్ కణాలు పేగు లైనింగ్ వంటి జీవసంబంధమైన అడ్డంకులను, కొన్ని సందర్భాల్లో రక్తం, మెదడుకు హాని చేస్తాయంట. నాడీ వ్యవస్థపై మరింత తీవ్రమైన ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం వెల్లడైన అధ్యయనంలో, ప్రతి గ్రాము గమ్ నుండి 100 మైక్రోప్లాస్టిక్‌లు విడుదలవుతున్నాయని తేలింది. కొన్ని ఉత్పత్తులు గ్రాముకు 600 మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తాయి.