
ఒక్కసారి కరోనా సోకితే శరీరంలో దీర్ఘకాలం ఉంటుందా? ఇటీవల యువకుల్లో హాఠాత్తుగా సంభవించే గుండెపోటు మరణాలకు గతంలో సోకిన కరోనా వైరస్సే కారణమా? కరోనా తగ్గినా కూడా వైరస్ మాత్రం శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లడం లేదా? ఇలాంటి అనుమానాలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిపుణులు మాత్రం ఆ అనుమానాలను కొట్టిపడేస్తున్నారు. అయితే ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం మాత్రం విస్తుపోయే రిపోర్ట్స్ వెల్లడించింది. కరోనా ఇన్‌ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందన్న విషయంతో ప్రమేయం లేకుండా కరోనా బారిన పడిన వ్యక్తుల మెదళ్లు వేగంగా ముసలితనానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆ రిపోర్ట్స్ సారాంశం.
కరోనా బారిన పడిన వ్యక్తుల మెదళ్లు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వార్ధక్యంతో ఉన్నాయని ఒక అధ్యయనంలో గుర్తించారు. కరోనా సోకిన 432 మంది వ్యక్తుల మెదడు స్కాన్‌లు మహమ్మారికి ముందు, తర్వాత ఈ అధ్యయనం కోసం తీసుకున్నారు. 996 మంది ఆరోగ్యవంతుల స్కాన్‌లనూ పరిశీలించారు. వీరితో పోలిస్తే వ్యాధిబారిన పడినవారి మెదళ్లు ఐదున్నర నెలలు ఎక్కువగా వృద్ధాప్యానికి గురైనట్టు గుర్తించారు.
కరోనా బాధితులు ఏకాంతంలో గడపాల్సిరావడం, అనిశ్చిత పరిస్థితి ఎదుర్కోవాల్సిరావడం ఇందుకు కారణాలు కావచ్చని నిపుణులు అంటున్నారు. మహమ్మారికి గురైన వయోవృద్ధులు, పురుషులు, నిరుద్యోగులు, తక్కువ ఆదాయం కలిగినవారు, తగినంతగా చదువుకోనివారు, ఇతర బలహీన నేపథ్యం కలిగినవారి మెదళ్లలో కీలక మార్పులు సంభవించినట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
మెదడు వృద్దాప్యానికి చేరువైనప్పుడు వ్యక్తుల ఆలోచనలు మసకబారడం, సమాచార విశ్లేషణ, సేకరణ, అవగాహన శక్తి కోల్పోవడం, ఏకాగ్రత సన్నగిల్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు వెల్లడించారు. కరోనా సోకినవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా గుర్తించినట్లు అధ్యయనం రిపోర్టులో వెల్లడించారు.