ఢిల్లీ పేలుళ్లపై భూటాన్ రాజు దిగ్భ్రాంతి.. బాధితుల కోసం థింఫులో స్థానికులతో కలిసి ప్రార్థనలు

ఢిల్లీలోని ఎర్రకోట ముందు జరిగిన పేలుడుపై భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భూటాన్ రాజు, వేలాది మంది భూటాన్ ప్రజలతో కలిసి, థింఫులోని సాంగ్లి థాంగ్ స్టేడియంలో ఢిల్లీ పేలుడు బాధితుల కోసం ప్రార్థనలు చేశారు. పేలుడులో విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఢిల్లీ పేలుళ్లపై భూటాన్ రాజు దిగ్భ్రాంతి.. బాధితుల కోసం థింఫులో స్థానికులతో కలిసి ప్రార్థనలు
Bhutanese Prayers

Updated on: Nov 11, 2025 | 6:16 PM

ఢిల్లీలోని ఎర్రకోట ముందు జరిగిన పేలుడుపై భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భూటాన్ రాజు, వేలాది మంది భూటాన్ ప్రజలతో కలిసి, థింఫులోని సాంగ్లి థాంగ్ స్టేడియంలో ఢిల్లీ పేలుడు బాధితుల కోసం ప్రార్థనలు చేశారు. పేలుడులో విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన పేలుడులో మొత్తం 10 మంది మరణించగా, 28 మంది గాయపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా భూటాన్ పర్యటనలో ఉన్న సమయంలో జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ ఈ సంతాప ప్రకటన చేశారు. భూటాన్‌లోని చాంగ్లిమిథాంగ్ ఫెస్టివల్ గ్రౌండ్‌లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ, ఢిల్లీ పేలుడుకు కారణమైన వారందరినీ చట్టం ముందు నిలబెట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ పేలుడు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని అన్నారు. పేలుడు బాధితుల బాధను తాను అర్థం చేసుకున్నాను. దేశం మొత్తం బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పేలుడుకు కారణమైన వారెవరిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు.

సోమవారం (నవంబర్ 10) సాయంత్రం ఎర్రకోట ప్రాంతంలో ఒక కారులో భారీ పేలుడు సంభవించింది. ఆ కారు ఎర్రకోట రోడ్డులో ప్రయాణిస్తోంది. సాయంత్రం రద్దీ సమయం కారణంగా, ట్రాఫిక్ భారీగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలో, ఒక i20 కారు పేలి, సమీపంలోని అనేక వాహనాలను మంటలు చుట్టుముట్టాయి. ఆ పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా కుదేలైంది.

పేలుడు ధాటికి వాహనాలు ధ్వంసమయ్యాయి. సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తుల ప్రకారం, అనేక మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి తరలించారు. అక్కడ క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. చాందినీ చౌక్ మార్కెట్‌లో నిలబడి ఉన్న జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాయపడిన వారిని పరామర్శించడానికి ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిని సందర్శించారు. ఆ తర్వాత ఆయన పేలుడు స్థలాన్ని సందర్శించి సమాచారం సేకరించారు. ప్రస్తుతం, అన్ని దర్యాప్తు సంస్థలు చురుగ్గా వ్యవహరించి దర్యాప్తులో నిమగ్నమై ఉన్నాయి. ప్రభుత్వం దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించింది. మరోవైపు ఢిల్లీ నుండి జమ్మూ కాశ్మీర్ వరకు బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..