Bangladesh Floods: బంగ్లాదేశ్‌ను వరదలు అల్లకల్లోలం చేశాయి. సుమారు 60 మంది మరణించారు. చాలా ప్రాంతాలు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి.. కుండపోత వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహించాయి. భారీ వరదలతో బంగ్లాదేశ్ ఈశాన్యంలోని సిల్హెట్ సహా పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందలాది గ్రామాలు నీటిలో మునిగాయి.. పంట పొలాలను వరద నీరు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి, చాలా గ్రామాలకు విద్యుత్ నిలిచిపోవడంతో అంధకారంలో మునిగిపోయాయి. తాగునీటికి కూడా తీవ్ర కొరత ఏర్పడింది..
ఈ వరదల్లో సుమారు 60 మంది మరణించారని బంగ్లాదేశ్ అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు.. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు నాలుగు లక్షల మంది వరదల బారిన పడ్డారు. వర్షాలు, వరదలు తగ్గముఖం పట్టినా అనేక ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి.
బంగ్లాదేశ్‌లో వరదలు కొత్తేమీ కాదు.. ప్రతి ఏటా వరదలు వస్తూనే ఉంటాయి అయితే ఈసారి 20 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో వర్షపాతం, వరదలు నమోదయయ్యాయని అక్కడి అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ ఎగువ ప్రాంతంలో ఉన్న భారత్‌లోని అస్సాం రాష్ట్రంలో వరదల కారణంగా బ్రహ్మపుత్రానది ఉగ్రరూపం దాల్చింది. ఈ ప్రభావం కూడా బంగ్లాదేశ్ మీద పడింది. వరద నీరు తగ్గుక పోవడంతో సహాయక కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోంది..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..