India – Poland: ఇతర దేశాల్లో ఎందుకు పరాన్న జీవులుగా జీవిస్తున్నారు.. భారతీయుడికి పోలండ్ లో అవమానం..

|

Sep 02, 2022 | 12:07 PM

విదేశాల్లో నివాసముంటున్న భారతీయులపై ఇటీవల కాలంలో జాత్యహంకార దాడులు పెరిగిపోతున్నాయి. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా మానసికంగా వేధిస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తమ దేశం నుంచి...

India - Poland: ఇతర దేశాల్లో ఎందుకు పరాన్న జీవులుగా జీవిస్తున్నారు.. భారతీయుడికి పోలండ్ లో అవమానం..
India Poland
Follow us on

విదేశాల్లో నివాసముంటున్న భారతీయులపై ఇటీవల కాలంలో జాత్యహంకార దాడులు పెరిగిపోతున్నాయి. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా మానసికంగా వేధిస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని దాడులకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా పోలండ్ లో ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భారతీయుడిపై పోలండ్ దేశీయుడు జాతి వివక్షకు పాల్పడ్డాడు. రాజధాని వార్సాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి అక్కడే ఉన్న భారతీయుడిపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా అతను నడుస్తుండగా అనుమతి లేకుండా వీడియో తీశాడు. మీరు పోలాండ్‌లో ఎందుకు ఉన్నారు? మీరు మీ దేశానికి తిరిగి వెళ్లిపోండి అని బెదిరించాడు. అంతటితో ఆగకుండా తమ దేశంపై దాడి చేసే కుట్రకు పాల్పడుతున్నారని, ఎక్కడెక్కడి నుంచి మా దేశానికి ఎందుకు వస్తున్నారని అనుచితంగా ప్రవర్తించాడు. మీకు భారతదేశం ఉంది కదా.. తెల్లవాళ్ల ప్రాంతాలకు ఎందుకు వస్తున్నారని, ఇతర దేశాల్లో ఎందుకు పరాన్నజీవులుగా జీవిస్తున్నారని రెచ్చగొట్టాడు. అయినా భారత వ్యక్తి మాత్రం అతని మాటలు పట్టించుకోకుండా చాలా సౌమ్యంగా వీడియో రికార్డింగ్ ను ఆఫ్ చేయాలని కోరడం చూడవచ్చు.

కాగా.. గతంలో అమెరికాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒక మహిళ తన ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్తున్న సమయంలో మెక్సికన్ అమెరికన్ అయిన ఒక మహిళ వారితో గొడవకు దిగింది. వారిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడింది. నలుగురు భారతీయ అమెరికన్ మహిళలు మాట్లాడుతుండగా అక్కడికి ఓ మహిళ వచ్చింది. మీ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని రెచ్చగొట్టింది. తాను భారతీయులని ద్వేషిస్తున్నానని దుర్భాషలాండింది. బెట‌ర్ లైఫ్ కోస‌మే భార‌తీయులు అమెరికా వ‌స్తుంటార‌ని, మీరు అమెరికాను నాశనం చేస్తున్నారని మండిపడింది. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..