US Student VISA: కరోనా కారణంగా అన్ని కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ మాయదారి పంజాకు చిక్కడంతో ప్రపంచమంతా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక కార్యకలాపాలే కాకుండా.. విద్య సంబంధిత కార్యకలపాలు కూడా ఆగిపోయాయి. దీంతో అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియను కొన్ని రోజులపాటు ఆపేసింది అమెరికా ప్రభుత్వం. తాజాగా పరిస్థితులు బాగు పడుతుండడంతో విద్యార్థి వీసా ప్రక్రియను ప్రారంభించనున్నారు.
ఇందులో భాగంగా సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతున్నట్లుగా దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో కాన్సులర్ వ్యవహారాల మంత్రి డాన్ హెఫ్లిన్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన గురువారం సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ ఏడాది జులై, ఆగస్టులో తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక పర్యాటక వీసాలైన బి1/బి2 కోసం ఎదురుచూస్తున్న వారు మరి కొంతకాలం వేచి ఉండాలని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు ప్రయాణానికి మూడు రోజుల ముందుగా విద్యార్థులు కరోనా పరీక్ష చేయించుకోవాలి. నెగెటివ్‌గా నిర్ధారణయిన వారిని మాత్రమే ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు. వ్యాక్సిన్ విషయంలో ఆయా విశ్వవిద్యాలయాలదే తుది నిర్ణయం. వ్యాక్సిన్ వేయించుకోవాలా? లేదా? వ్యాక్సిన్ తప్పదు అంటే ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలి? అన్నది విశ్వవిద్యాలయ అధికారులతో సంప్రదించి విద్యార్థులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని డాన్ హెఫ్లిన్ స్పష్టం చేశారు.
Also Read: AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8,239 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా