వందేళ్లలో ఎన్నడూ చూడని ఘోర విపత్తు. భారీ భూకంపంతో టర్కీ కకావికలైమంది. వేలమంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా లెక్కకు అందడంలేదు. మరో వైపు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత.. వెన్నులో వణుకు పుట్టించే చలి.. మరో గత్యంతరంలేక టెంట్ల కింద బతుకీడుస్తున్నారు. అయితే టర్కీ ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన తాత్కాలిక వసతిని ఏర్పాటు చేస్తోంది. కంటేనర్ సిటీలను ఏర్పాటు చేస్తోంది. మరింత సమాచారం టర్కీ నుంచి మా ప్రతినిధి హసీనా అందిస్తారు. టర్కీ ప్రభుత్వ అంచనాల ప్రకారం .. కోటి 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. చలిలో విలవిల్లాడుతున్న వీరందరికీ ఆశ్రయం కల్పించేందుకు టర్కీ సర్కార్ నడుంబిగించింది. పుట్టెడు కష్టాల్లో ఉన్న తమ పౌరులను ఆదుకునేందుకు ఉన్నంతలో వారి కోసం కంటేనర్లలో షెల్టర్ ఏర్పాటు చేస్తున్నారు. కంటేనర్లలో తాత్కాలిక ఇళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు టర్కీని భూకంపాలు కోలుకోనివ్వడం లేదు. ఇప్పటికే భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన టర్కీని.. అర్ధరాత్రి ప్రకంపనలు మరోసారి భయపెట్టాయి. హతాయ్ ప్రావిన్సులో 6.4 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం డెఫ్నె నగర సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రకంపనల తీవ్రతకు ఇప్పటికే బలహీనపడిన కొన్ని భవనాలు కూలిపోయాయినట్టు చెబుతున్నారు. అయితే తాజా ప్రాణ నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. భూకంప ప్రభావం సిరియా, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాల్లోనూ స్వల్పంగా కనిపించింది.
టర్కీని భూకంపం వణికించి 15 రోజులు పూర్తయ్యింది. అయినప్పటికి శిథిలాల కింద నుంచి జనం ప్రాణాలతో బయటపడుతున్నారు. అదృష్టం కొద్ది కొందరు ప్రాణాలతో బయటపడుతుండగా.. చాలా మంది మృతదేహాలు లభ్యమవుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది.. శిథిలాలను చాలా జాగ్రత్తగా తొలగిస్తూ సహాయక చర్యలు అందిస్తున్నరు. ఇక టర్కీలో శిథిలాల తొలగింపు వేగంగా కొనసాగుతోంది. హటాయ్ ప్రాంతంలో భారీ సంఖ్యలో బిల్డింగ్‌లు నేలమట్టం అయ్యాయి. నేలమట్టం అయిన భవనాల కింద నుంచి జనాన్ని బయటకు తీస్తున్నారు. సహాయక సిబ్బంది చాలా ఓపిగ్గా తమ విధులను నిర్వహిస్తున్నారు. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా? అని పూర్తిగా తనిఖీలు చేసిన తరువాతే ముందుకెళ్తున్నారు.
శిథిలాల కింద నుంచి బయటపడ్డ వాళ్లు చాలా బలహీనంగా ఉన్నారు. దాంతో వాళ్లను ఆస్పత్రికి తరలించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శిథిలాల నుంచి బయటపడ్డ వాళ్లకు వెంటనే థర్మల్ జాకెట్లు వేస్తున్నారు. భూకంపంతో తల్లడిల్లిన టర్కీకి విదేశాల నుంచి భారీగా సాయం అందుతోంది. భూకంపం కారణంగా 45 వేల మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఇంకా 200 ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపంతో 11 ప్రావిన్సుల్లో నష్టం కలుగగా.. ఆదనా, కిలిస్, సనిలుర్ఫా ప్రావిన్సుల్లో రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లు తుర్కియే అధికారులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..