ఆఫ్ఘనిస్థాన్ లో బలగాలను ఈ నెల 31 తరువాత కూడా కొంతకాలం పొడిగించాలన్న బ్రిటన్ తదితర దేశాల అభ్యర్థనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తోసిపుచ్చారు. నిన్న జరిగిన జీ-7 దేశాల కూటమి సమావేశంలో ఆయన..ఇందుకు అవకాశాలు లేవని స్పష్టం చేశారు. తమ ప్రజల తరలింపునకు అనువుగా ఈ గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ చివరిసారిగా కోరినప్పటికీ ఆయన అంగీకరించలేదు. ఆ తరువాత టీవీ లైవ్ బ్రాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ..ఈ డెడ్ లైన్ కి కట్టుబడే ఉండాలని తాను భావించానన్నారు. 24 గంటల నుంచి 36 గంటల్లోగా బ్రిటన్..ఆఫ్ఘన్ నుంచి తమ ప్రజలను తరలించవలసి ఉంటుందని ఆయన చెప్పారు.(ఇదే విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆ తరువాత ధృవీకరించింది). ఈ నెల 14 నుంచి 70 వేలమందికి పైగా అమెరికన్లను
, ఇతర విదేశీయులను తరలించడం జరిగిందని, పైగా కేవలం గత 12 గంటల్లోనే 12 వేలమందికి పైగా ప్రజలు ఆఫ్ఘన్ ను వీడారని ఆయన చెప్పారు. కాబూల్ నుంచి ఆఫ్ఘన్లను, ఇతర దేశియులను తరలించడంలో తమ బలగాలకు తాలిబన్లు సహకరించాలని బైడెన్ కోరారు. డెడ్ లైన్ పొడిగింపు విషయంలో అమెరికాను ఎలాగైనా ఒప్పించగలమన్న బ్రిటన్ తదితర దేశాలకు ఆశాభంగమే కలిగింది.
ఒక విధంగా ఇక ఈ గడువు తరువాత ఆఫ్ఘన్ లో మిగిలిఉన్నవారిని వారి ఖర్మానికి వారిని తాలిబాన్లకు వదిలివేసినట్టు భావిస్తున్నారు. వందలాది యూఎస్ ట్రూపులు ఆఫ్ఘానిస్తాన్ ను వీడనారంభించాయని పెంటగాన్ వెల్లడించింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఇలా ఉండగా దేశాన్ని వదిలి వెళ్లరాదని తాలిబన్లు ఆఫ్ఘన్లకు నిన్న ఫత్వా జారీ చేశారు. కాబూల్ విమానాశ్రయానికి దరి తీసే రోడ్లను వారు మూసివేశారు. ఎయిర్ పోర్టు చుట్టూ చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. విదేశీయులు కూడా ఈ ప్రాంతానికి రాకుండా చూస్తున్నారు.