ఆఫ్ఘనిస్తాన్ లో ఈ నెల 31 తరువాత కూడా అమెరికా, బ్రిటన్ బలగాలను పొడిగించవచ్చునన్న యోచనకు తాలిబన్లు నిరాకరించారు. ఈ దేశాలకు తాజాగా హెచ్చరిక జారీ చేస్తూ ఈ ప్రతిపాదనను తాము ఎంతమాత్రం అంగీకరించబోమన్నారు. ఇంజనీర్లు, ఇతర రంగాల్లో నైపుణ్యం గల ఆఫ్ఘన్లను తరలించరాదని తాలిబన్ల అధికార ప్రతినిధి జహీబుల్లా ముజాహిద్ కోరారు. దేశం నుంచి పూర్తిగా ఆఫ్ఘన్లు, విదేశీయుల తరలింపునకు అనువుగా ఆగస్టు 31 డెడ్ లైన్ ని పొడిగించవచ్చునని కొన్ని దేశాలు అంటున్నాయని, కానీ దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పాడు. ఇంజనీర్లు, డాక్టర్ల వంటి ఆఫ్ఘన్లను ఇక్కడి నుంచి తీసుకువెళ్లరాదని తాము అగ్రరాజ్యాన్ని కోరుతున్నామన్నారు. వారి నైపుణ్యం ఇక్కడ ఎంతయినా అవసరమన్నారు. పైగా ఆఫ్ఘన్ నుంచి పారిపోవాలని ఏ దేశం కూడా వారిని ప్రోత్సహించరాదని ఆయన అన్నాడు. ఈ నెల 31 లోగా అందరినీ తరలించజాలమని యూరోపియన్ దేశాలు చెబుతుండగా.. డెడ్ లైన్ ని పొడిగించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పై ఒత్తిడి పెరుగుతోంది. కానీ ఆయన తన నిర్ణయానికి కట్టుబడే ఉన్నట్టు తెలుస్తోంది.
కాబూల్ లో మీడియాతో మాట్లాడిన జహీబుల్లా..వారికి (అమెరికా, ఇతర దేశాలకు) విమానాలు, విమానాశ్రయాలు ఉన్నాయని.. వారి ప్రజలను ఇక్కడి నుంచి తరలించవచ్చునని అన్నాడు. డెడ్ లైన్ పొడిగించాలని పలు దేశాలు కోరుతున్నాయన్నాడు. అయితే నిపుణులైన ఆఫ్ఘన్ల అవసరం ఇక్కడ చాలా ఉంది.. ఈ దేశ అభివృద్ధికి వారి నైపుణ్యం తోడ్పడుతుంది అన్నాడు. దేశంలో భద్రతా పరిస్థితులు మెరుగు పడేంతవరకు ఇక్కడే..తమ ఇళ్లలోనే ఉండాలని మహిళలను ఆయన కోరాడు. ముఖ్యంగా మహిళా ప్రభుత్వ సిబ్బందికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇక డెడ్ లైన్ విషయంలో కొన్ని దేశాలు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. గురువారంలోగా తమ దేశియులను తరలిస్తామని ఫ్రాన్స్ అంటుండగా..కాబూల్ లోని తమ దౌత్య సిబ్బందిని ఈ గడువులోగా తరలించజాలమని స్పెయిన్ చేతులెత్తేసింది.