AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాఠశాల సమీపంలో డైనమైట్‌ విస్ఫోటనం.. ఆరుగురు విద్యార్థులు మృతి, 97 మందికి గాయాలు!

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని కునార్‌ ప్రావిన్స్‌లో ఓ పాఠశాల సమీపంలో జరిగిన భారీ పేలుడులో కనీసం ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 97 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మృతులు, క్షతగాత్రుల సంఖ్య ప్రాథమికమని, సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

పాఠశాల సమీపంలో డైనమైట్‌ విస్ఫోటనం.. ఆరుగురు విద్యార్థులు మృతి, 97 మందికి గాయాలు!
Afganistan Blast
Balaraju Goud
|

Updated on: Nov 28, 2026 | 6:22 PM

Share

కునార్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని కునార్‌ ప్రావిన్స్‌లో ఓ పాఠశాల సమీపంలో జరిగిన భారీ పేలుడులో కనీసం ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 97 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మృతులు, క్షతగాత్రుల సంఖ్య ప్రాథమికమని, సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

కునార్‌ ప్రావిన్స్‌లోని అందర్‌ సెర్‌ ప్రాంతంలో ఉన్న ఓ మాధ్యమిక పాఠశాల సమీపంలోని ఇంట్లో శనివారం (నవంబర్ 28) ఉదయం సుమారు 10 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఈ పేలుడు సంభవించింది. ఇంట్లో భారీ మొత్తంలో డైనమైట్‌ను నిల్వ ఉంచడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. మైనింగ్‌ కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులు ఆ ఇంట్లో పేలుడు పదార్థాలను భద్రపరిచినట్లు కునార్‌ సమాచార, సాంస్కృతిక వ్యవహారాల డైరెక్టర్‌ మౌల్వీ సమీ-ఉల్‌-హక్‌ తెలిపారు.

కునార్‌ ప్రావిన్స్‌ ఆసుపత్రి అధిపతి మౌలా దాద్‌ ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మరణించగా, 97 మంది గాయపడినట్లు అల్‌ జజీరాకు వెల్లడించారు. మరోవైపు, ఘటనపై సమాచారం అందుకున్న దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టాయి. నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆఫ్ఘనిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముఫ్తీ అబ్దుల్‌ మతిన్‌ కనీ పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఖనిజ సంపద అపారంగా ఉన్నప్పటికీ, గనుల తవ్వకాల్లో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం తరచూ ప్రమాదాలకు దారితీస్తోంది. ఇనుప ఖనిజం, రాగి, బంగారం, బొగ్గు, జింక్‌, విలువైన రాళ్ల తవ్వకం అక్కడ ప్రధాన పరిశ్రమలుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కునార్‌ ప్రాంతంలో రత్నాల తవ్వకాలు విస్తృతంగా జరుగుతున్నాయి. గత ఆగస్టు నెలలో కాబూల్‌లోని ఓ పాఠశాల సముదాయంపై జరిగిన హ్యాండ్‌ గ్రెనేడ్‌ దాడిలో 40 మందికి పైగా చిన్నారులు గాయపడ్డారు. తాజాగా జరిగిన పేలుడు ఆఫ్ఘనిస్తాన్‌లో విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us