టెక్సాస్, డిసెంబర్ 28: అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు భారతీయులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ దగ్గరి బంధువులుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే సతీష్ బాబాయి నాగేశ్వరరావు, ఆయన భార్య, కూమార్తె, ఇద్దరు చిన్నారులు ఈ ప్రమాదంలో మరణించారు. ఎమ్మెల్యే సతీష్ బాబు చిన్నాన్న కూమర్తె నవీన గంగ, అల్లుడు లోకేష్ తమ ఇద్దరు పిల్లలతో టెక్సాస్‌లో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ మరుసటి రోజు డిసెంబర్ 26న జాన్సన్ కౌంటీలో ఈ సంఘటన జరిగింది.
6 నెలల క్రితం అమలాపురం వచ్చిన కుమార్తె నవీనతో కలిసి తండ్రి నాగేశ్వరరావు, తల్లి సీతామహాలక్ష్మి టెక్సాస్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం ఫ్యామిలీ మొత్తం జంతు ప్రదర్శన శాలకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి టెక్సాస్‌కు వెళ్తుండగా ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న పికప్ ట్రక్కు మినీ వ్యాన్‌ను బలంగా ఢీ కొట్టింది. టెక్సాస్‌లోని జాన్సన్ కౌంటీ వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం ట్రక్కు రాంగ్ రూట్లో వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నాగేశ్వరరావు, ఆయన భార్య, కూమార్తె, మనవడు, మనవరాలు మరో బంధువు అక్కడికక్కడే మృతి చెందారు. నాగేశ్వరరావు అల్లుడు లోకేష్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఇక ట్రక్ నడిపిన ఇద్దరు యువకులు కూడా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
దీనిపై ఎమ్మెల్యే సతీష్ మాట్లాడుతూ.. ‘నాగేశ్వరరావు ఆయన కుటుంబ సభ్యులతో క్రిస్మస్ పండుగ సందర్భంగా అమెరికాలో బంధువుల ఇంటికి వెళ్లారు. డిసెంబర్ 26న ఉదయం జూకి వెళ్లి సాయంత్రం 4 గంటలకు (అక్కడి స్థానిక కాలమానం ప్రకారం) బయలుదేరారు. వారి కారును రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్కు నడిపిన యువకులదే తప్పది అక్కడి స్థానిక పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. లోకేష్ ఇంకా చికిత్స పొందుతున్నందున, పుట్టుకతో అమెరికన్ పౌరులు అయిన వారి ఇద్దరి పిల్లల మృతదేహాలను కూడా తీసుకొచ్చేందుకు అతని అంగీకారం అవసరమని’ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్ చేయండి.