Nancy Pelosi: తైవాన్‌లో అడుగుపెట్టిన అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. ఫైటర్ జెట్‌లను మోహరించిన చైనా..

|

Aug 03, 2022 | 5:30 AM

తైవాన్‌ ప్రజాస్వామ్యానికి మద్దతు కొనసాగిస్తామని, ఇండో-ఫసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛకు మేం కట్టుబడి ఉంటామని ట్వీట్‌ చేసి మరి.. నాన్సీ పెలోసీ చైనాకు వార్నింగ్ ఇచ్చారు.

Nancy Pelosi: తైవాన్‌లో అడుగుపెట్టిన అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. ఫైటర్ జెట్‌లను మోహరించిన చైనా..
Nancy Pelosi
Follow us on

US House Speaker Nancy Pelosi Taiwan Visit: చైనా ఎంతగా బెదిరించినా.. డోంట్‌ కేర్‌ అంటూ తీవ్ర ఉద్రిక్తతల నడుమ అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌ చేరుకున్నారు. తైపీ ఎయిర్‌పోర్టులో మంగళవారం పెలోసీ బృందానికి సాదర స్వాగతం లభించింది. తైవాన్‌కు వస్తే ఊరుకోబోమని, తమ ప్రతిచర్యను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చైనా చేస్తూ వచ్చిన వార్నింగ్‌లకు నాన్సీ పెలోసీ ఏమాత్రం పట్టించుకోలేదు. తైపీలో అడుగు పెట్టగానే, తైవాన్‌ ప్రజాస్వామ్యానికి మద్దతు కొనసాగిస్తామని, ఇండో-ఫసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛకు మేం కట్టుబడి ఉంటామని ట్వీట్‌ చేసి మరి.. నాన్సీ పెలోసీ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తమ సార్వభౌమ భద్రతా ప్రయోజనాలను అణగదొక్కినందుకు అమెరికా మూల్యం చెల్లిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది చైనా.. తైవాన్‌ దిశగా ఫైటర్‌ జెట్స్‌ను పంపడంతో పాటు ఆ దేశ ప్రభుత్వ వెబ్‌సైట్లను డ్రాగన్‌ కంట్రీ హ్యాక్‌ చేసింది. US హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో అడుగుపెట్టగానే.. 20కి పైగా చైనా సైనిక విమానాలు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి వెళ్లాయని తైపీలోని అధికారులు తెలిపారు. దీంతో తైవాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమని చైనా మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. అక్కడి ప్రజాస్వామ్యానికి అమెరికా అండగా నిలవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. నాన్సీ పెలోసీ తైవాన్‌ రావడం అగ్గి మీద గుగ్గిలం వేసినట్లయింది. మరోవైపు చైనా హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని అగ్రరాజ్యం అమెరికా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. ఎలాంటి పరిస్థితులనూనా ఎదుర్కొనేందుకు వీలుగా నాలుగు యుద్ధ నౌకలను తైవాన్‌ ద్వీపానికి తూర్పులో మొహరించింది. నాన్సి పెలోసీ తైవాన్‌ నాయకులతో సమావేశమైన తర్వాత సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది. తైవాన్‌ పర్యటన తర్వాత సింగపూర్‌, మలేషియా, జపాన్‌, సౌత్‌ కొరియాలో నాన్సీ పెలోసి పర్యటించనున్నారు. చైనా ప్రతి చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అంశాన్ని అమెరికా నిషితంగా గమనిస్తోంది.

నాన్సీ పెలోసీ పర్యటన నేపథ్యంలో బుధవారం నుంచి చైనా సైన్యం సైనిక విన్యాసాలను ప్రారంభించనుంది. ఈ పర్యటనకు ప్రతిస్పందనగా తైవాన్ జలసంధిలో ద్వీప దేశం చుట్టూ సైనిక విన్యాసాలను చేయనున్నట్లు బీజింగ్ ప్రకటించింది. అగ్నితో ఆడుకునే వారు దాని ద్వారానే నశిస్తారంటూ బీజింగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన కూడా చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి