విమానయాన చరిత్రలోనే అత్యంత సురక్షితమైన సంవత్సరం 2023.. రవాణా సాధనాల్లో విమానాన్ని మించినది లేదా?

| Edited By: Ravi Panangapalli

Jul 08, 2024 | 9:06 AM

అమెరికాకు చెందిన షెఫ్ ఫీల్డ్ స్కూల్ ఆఫ్ ఏరోనాటిక్స్ వెబ్ సైట్ అందించిన వివరాల ప్రకారం ప్రపంచంలోని రవాణా సాధనాల్లో అత్యంత సురక్షితమైన రవాణా వ్యవస్థ విమానయానం. నిజానికి ఆదికాలం నుంచే మానవులు విశాలమైన వినీలాకాశం వైపు ఆకర్షితులయ్యారు.

విమానయాన చరిత్రలోనే అత్యంత  సురక్షితమైన సంవత్సరం 2023.. రవాణా సాధనాల్లో విమానాన్ని మించినది లేదా?
Safest Year
Follow us on

ఎస్… మీరు చదివిన హెడ్ లైన్ ముమ్మాటికీ వాస్తవం. ఈ విషయాన్ని ధ్రువీకరించింది సాక్షాత్తు ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ IATA. గ్లోబల్ ఏవియేషన్‌ విభాగంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ నివేదిక విడుదల చేసింది IATA. ఆ నివేదికలో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ ఏడాది మొత్తం మీద ప్రతి 12 లక్షల 60 వేల విమాన ప్రయాణాలకు గాను కేవలం 0.8 శాతం మాత్రమే ప్రమాదాలు నమోదయ్యాయి. ఇది 2022లో 1.3గా ఉండేది. అలాగే మరణాల సంఖ్య కూడా చాలా చాలా తగ్గింది. 1945లో కేవలం 57 ఎయిర్ లైన్స్ సంస్థలు సభ్యులుగా ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 120 దేశాలకు చెందిన 330 ఎయిర్ లైన్స్ ఇందులో సభ్యత్వం కల్గి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ ట్రాఫిక్‌లో IATAలో సభ్యత్వం ఉన్న ఎయిర్ లైన్స్ సంస్థలు 80 శాతం ప్రయాణీకుల్ని తీసుకెళ్తాయి.

అమెరికాకు చెందిన షెఫ్ ఫీల్డ్ స్కూల్ ఆఫ్ ఏరోనాటిక్స్ వెబ్ సైట్ అందించిన వివరాల ప్రకారం ప్రపంచంలోని రవాణా సాధనాల్లో అత్యంత సురక్షితమైన రవాణా వ్యవస్థ విమానయానం. నిజానికి ఆదిమకాలం నుంచే మానవులు విశాలమైన వినీలాకాశం వైపు ఆకర్షితులయ్యారు. ఆకాశంలో పక్షిలా ఎగరాలని నక్షత్రాలను అందుకోవాలని కలలు కన్నారు. 1903లో విల్బర్‌ ఇంకా ఆలివ్‌ రైట్‌లు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రయాణించే విమానాన్ని ఆవిష్కరించడం ఓ అద్భుత ఘట్టం. రైట్ సోదరులకు ముందే 1895లోనే శివకర్ బాపూజీ తల్పాడే ముంబైలోని చౌపాటీ సమీపంలో విమానాన్ని నడిపించారని చరిత్రకారులు చెబుతున్నారు. పాదరసంతో నింపిన ఇంజిన్‌ను ఓ వెదురు గొట్టానికి అమర్చి గాల్లో పద్దెనిమిది నిముషాల పాటు ఎగురవేశారు. బరోడా మహారాజా శివాజీ రావు గైక్వాడ్ ఎదుట “మారుత్సఖ’ విమానం ఫీట్‌ను ప్రదర్శించారు. విమానం 1500 అడుగుల ఎత్తుకు వెళ్ళిందని కూడా చెబుతారు. సైనిక అవసరాల నిమిత్తం ముందుగా వినియోగంలోకి వచ్చిన విమానాలు ఆ తర్వాత వ్యక్తులు, వస్తువుల రవాణా సేవల్లోకి మారాయి.

1945లో మొదలైనప్పటి నుంచి నేటి వరకు కొన్ని వేల విమానాలు కొన్ని లక్షల ట్రిప్పుల్లో లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చుతున్నాయి. వాతావరణం అనుకూలించకో, సాంకేతి కారణాల వల్ల అక్కడక్కడా ప్రమాదాలు జరగడం చూస్తున్నాం. వీటికి భిన్నంగా కొన్ని వందలాది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటనలూ గతంలో జరిగాయి.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

మంగళూరులో విషాదం

అది 2012 మే 22 .. కర్నాటక రాష్ట్రం మంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్​ అయ్యేందుకు దుబాయ్​ నుంచి వచ్చిన ఎయిర్‌ ఎక్స్‌ప్రెస్ విమానం ప్రయత్నిస్తోంది. అప్పటికే విమానాన్ని దించాలా..వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు పైలట్. ల్యాండింగ్ వద్దు వెనక్కి వెళ్దామని కో పైలట్.. పైలట్‌కు మూడు సార్లు చెప్పారు. అంతలోనే విమానం రన్‌వేను దాటి కొండవారగా పడిపోవడం మంటల్లో చిక్కుకోవడం జరిగిపోయాయి. ప్రమాదంలో పైలట్‌, కో-పైలట్, ఇతర సిబ్బంది సహా.. 158 మంది అగ్నికి ఆహుతయ్యారు. కేవలం 8 మంది బయటపడ్డారు. సాధారణ రన్‌వేలపై దించిన విధంగానే.. టేబుల్‌టాప్‌పై ల్యాండ్​ చేయాలని పైలట్ ప్రయత్నించడం కూడా మంగళూరు విమాన ప్రమాద కారణాల్లో ఒకటని తేలింది.

విమానయానం ఎంత సురక్షితం?

పదేళ్లకు సీన్‌ రిపీట్‌

మంగళూరు ప్రమాదం జరిగిన పదేళ్లకు సరిగ్గా ఇలాంటి ప్రమాదమే కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. అది 2020 ఆగస్ట్‌ 7.. అక్కడిలాగే ఇక్కడ కూడా విమానాలు ల్యాండ్ అయ్యేందుకు టేబుల్‌టాప్ రన్‌వే ఉంది. దుబాయ్‌ నుంచి కోజికోడ్‌కు వస్తున్న ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 737 విమానం రన్​వేపై దిగుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది. అనంతరం పక్కనే ఉన్న 30 అడుగుల లోతైన లోయలోకి పడిపోయి రెండు ముక్కలైంది. విమానంలోని 19 మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగానే రన్‌వేపైకి నీరు చేరి విమానం అదుపుతప్పినట్లు డీజీసీఏ సమగ్ర దర్యాప్తులో తేల్చింది

టేబుల్‌ టాప్‌ రన్‌వేలు  అంటే ?

కొండ ప్రదేశంలో చదునుగా ఉండే చోట ఈ తరహా రన్‌వేను నిర్మిస్తారు. సాధారణ విమానాశ్రయాలలోని రన్‌వేలతో పోలిస్తే.. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లకు కూడా దృష్టభ్రాంతిని, అయోమయాన్ని కలిగిస్తాయి. పైలట్‌లు వెంట్రుకవాసి తప్పిదం చేసినా సరే విమానానికి భారీ ప్రమాదం తప్పదు. దేశంలో ఇలాంటి టేబుల్‌టాప్ రన్‌వేలు..మంగళూరు, కోజీకోడ్​, మిజోరంలో ఉన్నాయి. ఈ ఇబ్బందుల వల్ల పలు పౌర విమానయాన సంస్థలు బోయింగ్-737, ఎయిర్‌బర్ ఏ-330 వంటి విమానాలను టేబుల్‌టాప్‌ రన్‌వేలు ఉన్న విమానాశ్రయాలకు పంపడం మానుకున్నాయి.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

పౌర విమానంపై క్షిపణి దాడి?

1983 ఆగస్టు 31న 269 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న కొరియన్ ఫ్లైట్‌ 007 అమెరికా మిలిటరీ విమానంగా భావించిన సోవియట్ యూనియన్ దానిని పొరపాటున కూల్చివేసింది. అసలేం జరిగిందంటే.. కెనడా సమీపంలోని యాంకరేజ్‌ వద్ద నిలిచిన విమానం ఇంధనం నింపుకుని సియోల్‌కు బయల్దేరింది. విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో ఉంచిన సిబ్బందికి ఆటో పైలట్ మోడ్ పనిచేయడం లేదన్న సంగతి తెలియదు. కాసేపటి తర్వాత ఆ విమానం దాని నిర్దేశిత మార్గం నుంచి తప్పుకొని సోవియట్ భూభాగం వైపు వెళ్లడం ప్రారంభించింది. సియోల్‌కు వెళ్లాల్సిన విమానం సోవియట్ యూనియన్ తూర్పు తీరం వైపు పరుగులు పెట్టింది. కొరియన్ ఎయిర్‌లైన్స్ 007 విమానం నిర్దేశిత మార్గం నుంచి తప్పుకొని 200 కి.మీ దూరం సోవియట్ యూనియన్‌లోని తూర్పు తీరం వైపు ప్రయాణించింది. డోలింక్స్ సుకోల్ ఎయిర్‌బేస్‌కు చెందిన కమాండర్లు అలర్ట్‌ అయ్యారు. విమానాన్ని హెచ్చరిస్తూ రెండు సుఖోయ్ ఎస్‌యూ-15 విమానాలను పంపించారు. పైలట్ల నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో అమెరికా మిలిటరీ విమానంగా భావించి క్షిపణులను ప్రయోగించి కూల్చివేశారు. సఖాలిన్‌కు పశ్చిమాన మోనెరాన్ ద్వీపానికి సమీపంలోని సముద్రంలో ఆ విమానం కూలిపోవడంతో 269 మంది జలసమాధి అయ్యారు.

ప్యాసింజర్ల ప్రాణాలతో పైలట్‌ చెలగాటం

2014 మార్చి 8న మలేషియాలోని కౌలాలంపూర్‌ నుంచి చైనాలోని బీజింగ్‌కు వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ MH 370 విమానం ఎంహెచ్‌ 370 అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తూ అదృశ్యమైంది. ఈ విమానం మిస్సింగ్‌ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. విమానం విడి భాగాలు గానీ, దాని అదృశ్యానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను గానీ తెలుసుకునేందుకు అంతర్జాతీయ సంస్థలు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. విమానంలోని 239 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. ఈ విమానం కౌలాలంపూర్‌లో టేకాఫ్‌ అయ్యాక 39 నిమిషాల తర్వాత ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌తో సిగ్నల్‌ కోల్పోయింది. విమానం అదృశ్యంపై పరిశోధన చేసిన బృందంలోని సభ్యుడైన బ్రిటన్‌ ఏవియేషన్‌ నిపుణుడు, పైలట్ సైమన్ హార్డీ కీలక విషయాలు వెల్లడించారు. ఎంహెచ్‌ 370 విమానం పైలట్‌ జహారీ అహ్మద్ షా తన ఆత్మహత్య ప్రణాళికలో ప్రయాణికులను పావుగా వాడుకున్నారని తన స్కెచ్ ప్రకారమే విమానాన్ని అదృశ్యం చేసినట్లు సైమన్‌ హార్డీ తెలిపారు. ప్రమాద సమయంలో దక్షిణ హిందూ సముద్రంలోని గీల్విన్క్ ఫ్రాక్చర్‌ జోన్‌లో విమానం అదృశ్యం చేసేలా పైలట్‌ ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నించినట్లు తెలిపారు. ఎఫ్‌బీఐ పరిశోధన కూడా ఇలాంటి థియరీనే సమర్థించింది.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

గాల్లో విమానాలు ఢీ 349 మంది మృతి1996 నవంబర్ 12.. ఆ రోజును గుర్తు చేసుకుంటే అక్కడి వారికి ఇప్పటికీ వణుకే. దాదాపు పది కిలోమీటర్ల మేర చెల్లాచెదురుగా పడ్డ మృతదేహాలు, మాంసఖండాలు. ఎటు చూసినా విమాన శకలాలు..! హరియాణాలోని ఛర్ఖీదాద్రీ జిల్లాలో కనిపించిన దృశ్యం ఇది. 15 వేల అడుగుల ఎత్తులో రెండు విమానాలు ఒక దాంతో మరొకటి ఢీకొన్నాయి. అంతే.. 349 మంది క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం అది. అసలేం జరిగిందంటే..

ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఓ సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ 747 విమానం 290 మందితో టేకాఫ్ అయింది. మరోవైపు.. కజికిస్థాన్‌కు చెందిన మరో చార్టెర్డ్‌ విమానం ఆ ఎయిర్ పోర్టులో లాండయ్యేందుకు వస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది 14 వేల అడుగులకు ఎత్తుకు వెళ్లాలని సౌదీ అరేబియా విమానానికి సూచించారు. మరోవైపు.. కజికిస్థాన్ విమానానికి మాత్రం 15 వేల అడుగుల ఎత్తుకు దిగి అక్కడే కొనసాగాలని సూచించారు. కానీ.. ఈ సమయంలోనే ఓ అనూహ్య ఘటన జరిగింది. ఆంగ్ల భాషపై అంతగా పట్టులేని కజికిస్థాన్ విమాన పైలట్లు.. ఏటీసీ నుంచి అందిన మార్గదర్శకాలను సరిగా అర్థం చేసుకోలేకపోయారు. దీంతో.. 15 వేల అడుగుల ఎత్తులో ఉండే బదులు విమానాన్ని మరింత కిందకు దించారు. ఈ క్రమంలోనే ఎవ్వరూ ఊహించలేని ఘోరం జరిగిపోయింది.

అయితే..విమానం, ఏటీసీ సెంటర్‌లోని ఉండాల్సి రాడార్ వ్యవస్థలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో రాకపోవడంతో..విమానాలు దగ్గరగా వస్తున్నాయాన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో..ఆ రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. ఆకాశంలో పెద్ద విస్ఫోటనం..నారింజ రంగులో ఓ పెద్ద అగ్ని గోళం కనిపించింది. ఛర్ఖీదాద్రీ జిలాల్లో గగనతలంలో జరిగిందీ ఘోరం. ఈ ప్రమాదం తరువాత వైమానిక రంగంలో రెండు ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో మొదటిది..ఏసీఏఎస్ వ్యవస్థ! ఇది విమానాల మధ్య ఉన్న దూరాన్ని కచ్చితంగా లెక్కగట్టి పైలట్‌కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఇటువంటి ప్రమాదాలను నివారిస్తుంది. ఇక రెండో మార్పు పైలట్లకు ఆంగ్లంలో కనీస పరిజ్ఞానం ఉండాలన్న నిబంధన. దీన్ని తప్పనిసరి చేయాలంటూ భారత్ పట్టుబట్టింది. మొదట్లో ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ తరువాత.. అన్ని దేశాలు ఈ నిబంధనను అంగీకరించాయి.

Strict rules to the pilots

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

తీవ్ర విషాదం నింపిన ” కనిష్క” ప్రమాదం

1985 జూన్ 23న కెనడాలోని మాంట్రియల్ నుంచి న్యూఢిల్లీ చేరాల్సిన ఎయిర్ ఇండియా కనిష్క విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో లాండ్‌ కావడానికి ముందు అట్లాంటిక్ మహాసముద్రంపై పేలిపోయింది. ఇందులో ఖలిస్తాన్‌ సిక్కు తీవ్రవాదులు బాంబు అమర్చారు. ఈ ఘటనలో మొత్తం 329 మంది మరణించారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది కెనడాలో నివసిస్తున్న ఇండో కెనెడియన్లు. విమానం 31,000 అడుగుల ఎత్తులో ఉండగా పేలింది.

Feature Pic 2

మారణ హోమంలో 583 మంది బలి

1977 మార్చి 27న రన్‌వే పై రెండు విమానాలు ఢీ కొని ఏకంగా 583 మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికి 47 ఏళ్ల ముందు టెనెరిఫే విమాన ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. స్పెయిన్‌లోని లాస్ రోడియోస్ విమానాశ్రయంలో రెండు విమానాలు టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్నాయి. కేఎల్‌ఎం బోయింగ్ 747 విమానంతో పాటు, పాన్‌ఆమ్‌ విమానం ప్రయాణికులతో నిండుగా గాల్లోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండు విమానాలకు ఏవియేషన్‌ అధికారుల నుంచి టేకాఫ్‌కు క్లియర్స్‌ రావలసి ఉంది. అంతకు ముందు గ్రాన్‌ కానరియా ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఓ తీవ్రవాద ఘటన కారణంగా చాలా విమానాలను లాస్‌ రోడియోస్‌కు మళ్లించారు. ఇది చిన్న ఎయిర్‌పోర్ట్‌ కావడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. అదే సమయానికి పాన్‌ఆమ్‌ విమానం ఓ రన్‌వేపై ఆగి ఉంది. అయితే.. ఏవియేషన్‌ అధికారుల నుంచి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ క్లియరెన్స్‌ వచ్చిందని కేఎల్‌ఎం విమాన కెప్టెన్‌ రన్‌వేపై విమానాన్ని టేకాఫ్‌కు సిద్ధం చేసి విమానాన్ని ముందుకు నడిపించాడు. ఈ కేఎల్‌ఎం విమానం పరుగులు తీస్తున్న రన్‌వే పైనే అడ్డంగా పాన్‌ఆమ్‌ విమానం ఆగి ఉంది. పొగమంచు కారణంగా కేఎల్‌ఎం పైలెట్లు ఆ విమానానికి దగ్గరగా వచ్చేంత వరకు చూడలేకపోయారు. చాలా దగ్గరికి వచ్చిన తర్వాత సెన్సార్లు అలర్ట్‌ అవ్వడం, దూరంగా పాన్‌ఆమ్ విమానం కనిపించడంతో ఎమర్జెన్సీ టేకాఫ్‌ కోసం కేఎల్‌ఎం పైలెట్లు ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. చాలా వేగంగా వచ్చిన కేఎల్‌ఎం విమానం, పాన్ఆమ్‌ విమానాన్ని ఢీకొట్టింది. కేఎల్‌ఎం విమానంలోని 234 మంది ప్రయాణికులు. 14 మంది సిబ్బంది మరణించారు. పాన్ ఆమ్ విమానంలోని 396 మందిలో 335 మంది మరణించారు.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

శవాలను తిని బతికిన సర్వైవర్లు

1972 అక్టోబర్ 13న ఉరుగ్వేలోని 40 మంది రగ్బీ ఆటగాళ్లు ఓ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చిలీ రాజధాని శాంటియాగోకి బయలుదేరారు. వారు ప్రయాణించిన వైమానిక దళ విమానం ఆండీస్ పర్వత శ్రేణుల్లో కుప్పకూలింది. కొందరు మృతి చెందగా సజీవంగా ఉన్న వారు క్లిష్ట పరిస్థితుల్లో బయటపడిన తీరు వెలుగులోకి రావడంతో ప్రపంచం షాక్ తినింది. ప్రపంచానికి దూరంగా పగటిపూటే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆండీస్ పర్వతంలో రాత్రయితే భరించలేని మంచు వాతావరణంలో 72 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి బతికి బయటపడ్డారు కొందరు. ఆ మంచుకొండల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు చనిపోయిన వారి మాంసాన్ని తిన్నామని విస్తుపోయే నిజాలను వెల్లడించారు. ఏవియేషన్ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రమాదం ఇది.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.