
హిమాలయ దేశం నేపాల్‌ను (Nepal) భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పొరగుదేశం అతలాకుతలం అవుతోంది. సుదర్ పశ్చిమ్ ప్రావిన్స్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి. అచ్ఛం జిల్లాలో కొండచరియలు విరిగిపడి 17 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానికులు సహాయ సిబ్బందిని అలర్ట్ చేశారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని కొండ చరియల కింద చిక్కుకున్న మరో 11 మందిని రక్షించారు. హెలికాప్టర్ల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతైనట్లు అధికారులు వివరించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొండచరియలు (Landslides) రోడ్లపై పడిపోవడంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు.. భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. కొన్ని రోజులుగా నేపాల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఏడు జిల్లాలను కలిపే రహదారి దెబ్బతింది. నేపాల్ లో కురుస్తున్న భారీ వర్షాలు ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వర్షాల వల్ల కరెంట్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. నేపాల్ పూర్తిగా హిమాలయాల్లో ఉండటంతో అక్కడ వర్షాకాలం ప్రమాదాలు తరుచుగా జరుగుతుంటాయి.
కాగా.. నేపాల్ లో కురుస్తున్న వర్షాల ధాటికి ఉత్తరాఖండ్ లో మరోసారి వరదలు వణికిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక ఇళ్లు నీట మునిగాయి. పిథోరగఢ్ జిల్లాలో భారత్, నేపాల్ సరిహద్దులో ఆకస్మాత్తుగా కురిసిన వర్షాలకు ఒక మహిళ చనిపోయింది. నదీ ప్రవాహ ఉద్ధృతికి ఒడ్డున ఉన్న పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదలకు నది తీరం కోతకు గురైంది. దీంతో అంచులో ఉన్న ఒక బిల్డింగ్ కళ్లముందే కూలింది. వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్ పోలీస్, అగ్నిమాపక శాఖలు అప్రమత్తమయ్యాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాలు ఎక్కడికక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని, ప్రజలు, పర్యాటకులు సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..