హెచ్1బీ వీసాలకు లాటరీ రద్దు..! మారిన కొత్త రూల్స్ ఇవే
అమెరికా హెచ్1బీ వీసా లాటరీ విధానానికి ట్రంప్ సర్కార్ ముగింపు పలికింది. ఇకపై నైపుణ్యం, అధిక జీతం పొందే విదేశీ నిపుణులకు ప్రాధాన్యతనిస్తూ 'వెయిటెడ్ సెలక్షన్' పద్ధతిని అమలు చేయనుంది. ఈ మార్పు వల్ల ఎంట్రీ-లెవల్ భారతీయ నిపుణులకు అమెరికాలో వర్క్ వీసాలు పొందడం కష్టతరం కానుంది. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 27 నుండి అమల్లోకి వస్తాయి.
అమెరికాలో విదేశీ నిపుణులకు జారీ చేస్తున్న హెచ్1బీ వీసాల ఎంపికకు వాడుతున్న లాటరీ విధానాన్ని రద్దు చేసింది ట్రంప్ సర్కార్. కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై కొత్త విధానం ఆధారంగానే వర్క్ వీసాలను జారీ చేయబోతున్నారు. ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తులను కంప్యూటరైజ్డ్ విధానంలో లాటరీ వేసేవారు. ఎంపికైనవారు అమెరికాకు వచ్చేవారు. కానీ.. కొత్త విధానంలో ‘వెయిటెడ్ సెలక్షన్’ పద్ధతిని అనుసరించనున్నారు. అంటే.. ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతం అందుకునే వారికే హెచ్1బీ. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి కాదు. కొంతకాలంగా హెచ్1బీ వీసాల విధానంపై జరుగుతున్న చర్చకు చెక్ పెడుతూ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది. సుదీర్ఘకాలంగా విదేశీయులకు హెచ్1బీ వీసాల జారీకి వాడుతున్న లాటరీ విధానానికి ముగింపు పలికింది. నైపుణ్యం కలిగిన, అధిక జీతం పొందే విదేశీ కార్మికులకు ప్రాధాన్యతనిస్తూ కొత్త వెయిటెడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మార్పుతో భారతీయుల్లో ఎంట్రీ-లెవల్ నిపుణులకు అమెరికాలో వర్క్ వీసాలు పొందడం కష్టంగా మారబోతోంది. తక్కువ జీతంతో పనిచేయడానికి ఇష్టపడే విదేశీ కార్మికులకు అవకాశంగా మారిందనే విమర్శలున్న హెచ్1వీసా విధానాన్ని సమీక్షించిన ట్రంప్ సర్కార్.. వారిని కట్టడి చేసేందుకు కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. ఇది 2027 ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ సీజన్‌తో ప్రారంభమయ్యే ఏటా సుమారు 85,000 హెచ్1బీ వీసాలకు చెక్ పెట్టబోతోంది. తాజా విధానం ప్రకారం హెచ్ 1బీ వీసాల అర్హత కోసం యజమానులు వీసాకు అదనంగా లక్ష డాలర్లు చెల్లించక తప్పని పరిస్దితి ఎదురుకానుంది. ఇది ఎక్కువ నైపుణ్యం కలిగిన, అధిక జీతం పొందే విదేశీ కార్మికులకు హెచ్1బీ వీసాలు కేటాయించేందుకు వీలు కల్పిస్తుంది. లాటరీ విధానం దుర్వినియోగం అవుతోందని, అమెరికన్ల కన్నా తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ కార్మికులను తీసుకురావడానికి ఈ విధానాన్ని కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా హెచ్-1బీ వీసాల జారీకి అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ అనుసరిస్తున్న లాటరీ విధానంలో.. ఆ వీసాపై రావాలనుకునే ఉద్యోగులందరూ సమానమే. ప్రతిభ ఆధారంగాగానీ.. జీతం ఆధారంగాగానీ ఎవరికీ ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వరు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
సోషల్ మీడియాపై ఆర్మీ కొత్త రూల్స్.. ఇన్‌స్టా చూడొచ్చు.. కానీ
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
Gmail: గుడ్ న్యూస్.. మీ మెయిల్ ఐడీని మార్చుకోవచ్చు.. ఈ విధంగా
