ఆత్మకూరులో అద్భుత దృశ్యం ఆవిష్కృతం వీడియో
వర్షాకాలంలో కప్పలు చురుకుగా ఉంటాయి. పొలాలు, సరస్సులు, చెరువులు, తోటలు ఇలా ఎక్కడో ఒకచోట... క్రోక్... క్రోక్… అంటూ కప్పల శబ్దం మొదలవుతుంది. రాత్రి సమయంలో ఈ శబ్దం మరింత ఎక్కువగా వినిపిస్తుంటుంది. అయితే వర్షాకాలంలో ఎందుకు కప్పలు ఇలా శబ్ధం చేస్తాయి అనే సందేహం చాలామందికి కలుగుతుంది. దీని వెనుక శాస్త్రీయ కారణాలు, ప్రజల విశ్వాసాలు, పర్యావరణ చైతన్యం దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రీయంగా చూస్తే... వర్షాకాలంలో కప్పల శబ్దాన్ని ‘‘క్రోకింగ్’’అంటారు.
ఈ శబ్దాలను మగ కప్పలు ఆడ కప్పలను ఆకర్షించడానికి చేస్తాయి. వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం, చిన్న చిన్న నీటి వనరులు ఏర్పడటం వల్ల కప్పలకు గుడ్లు పెట్టడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే మగ కప్పలు ఆడ కప్పలను పిలవడానికి గట్టిగా, ప్రత్యేక రకమైన శబ్దం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పసుపు పచ్చ కప్పలు కనువిందు చేశాయి. శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి ఆత్మకూరు పట్టణంలోని కబేల వీధిలోని ఒక చిన్న కుంటలో 100 కు పైగా పసుపు రంగు కప్పలు క్రోక్..క్రోక్ అంటూ శబ్దం చేస్తూ ఉండడంతో అటువైపు వెళుతున్న పట్టణవాసులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఉండే రంగుకు భిన్నంగా పసుపు రంగులో ఉండటంతో పట్టణ వాసులు ఆశ్చర్యంగా తిలకించారు. తమ సెల్ ఫోన్ లలో వాటిని చిత్రీకరించారు. అయితే ఈ పసుపు రంగు కప్పలు వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తాయట. పసుపు రంగు కప్పలు భారత బుల్ ఫ్రాగ్స్. ఇవి భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్ వంటి దక్షిణాసియా దేశాలలో విస్తృతంగా కనిపిస్తాయి.
మరిన్ని వీడియోల కోసం :