Job Rejected: ఉద్యోగానికి సరిపోతారు..అందుకే రిజెక్ట్‌ అయ్యారు.! అవాక్కయిన అభ్యర్థి..

Job Rejected: ఉద్యోగానికి సరిపోతారు..అందుకే రిజెక్ట్‌ అయ్యారు.! అవాక్కయిన అభ్యర్థి..

Anil kumar poka

|

Updated on: Oct 25, 2024 | 8:55 PM

కొత్త ఉద్యోగానికి సరిపడా అర్హతలు లేక చాలా మంది తిరస్కరణకు గురవుతుంటారు. తనకు అన్ని అర్హతలు ఉండి, కొత్త జాబ్‌ను చేయగల సమర్థత ఉన్నాసరే ఉద్యోగాన్ని పొందలేకపోవడంతో ఒక అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఉద్యోగం ఇవ్వలేకపోవడానికి గల కారణాన్ని చూసి అవాక్కయింది. తర్వాత ఆ తిరస్కరణ తాలూకు వివరాలను ‘ఎక్స్‌’వేదికగా అందరితో పంచుకుంది.

అనూ శర్మ ప్రతిష్టాత్మక గూగుల్‌ సంస్థలో ఢిల్లీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తోంది. మెరుగైన ఉపాధి అవకాశాలు, జీతం, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వేరే సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. ఆన్‌లైన్‌లో రెజ్యూమె వివరాలు పంపింది. ఉద్యోగం తప్పకుండా వస్తుందనుకుంటే ‘తిరస్కరిస్తున్నాం’ అన్న సందేశం వచ్చింది. ఉద్యోగంలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను సంస్థ వివరించింది. ‘‘మీ రెజ్యూమెను క్షుణ్ణంగా పరిశీలించాం. ఇక్కడ తేలిందేమంటే ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ మీలో ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. ఇంతటి ప్రతిభావంతురాలు మాకు వద్దు. ఎందుకంటే ఎక్కువ ప్రతిభ ఉండి తక్కువ స్థాయి ఉద్యోగం చేసే వాళ్లలో సాధారణంగా ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. మరింత మెరుగైన ఉద్యోగాన్ని వీలైనంత త్వరగా వెతుక్కుని పాత ఉద్యోగాన్ని వదిలేస్తారు అని వివరణ ఉంది. ఇలాంటి కారణాలకు కూడా తిరస్కరిస్తారా? అని ఆమె ఆలోచనలో పడింది. ‘అర్హతలున్నా ఉద్యోగం ఎందుకు రాదో మీకు తెలుసా? అంటూ అనూ శర్మ రిప్లై స్క్రీన్‌షాట్‌ను ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేసింది

అనూ శర్మ పెట్టిన పోస్ట్‌కు స్పందనల వరద మొదలైంది. ‘‘అధిక అర్హతలతో బాధపడుతున్నారా?’అని ఒక నెటిజన్‌ సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘ఇదొక మంచి పరిణామానికి సంకేతం. ఒకరి దగ్గర పనిచేయడం మానేసి మీరే సొంతంగా కంపెనీ పెట్టి ఉద్యోగాలివ్వండి’ అని మరొకరు ఉచిత సలహా ఇచ్చారు. ‘‘ఉద్యోగం చేసే స్థాయి మీకున్నా, ఇచ్చేస్థాయి మాకు లేదు అని కంపెనీయే ఒప్పుకుంది’’అని మరొకరు ట్వీట్‌చేశారు. సంస్థనూ మెచ్చుకున్న వాళ్లు కోకొల్లలు ఉన్నారు. ‘‘కంపెనీ మంచి పనే చేసింది. అర్హత కాస్తంత తక్కువ ఉంటే ఉద్యోగం ఇచ్చి, పని బాగా చేయించి రాటుదేలాలా చేస్తారు. ఉద్యోగులు మధ్యలోనే మానేస్తారు. అప్పుడు నోటిఫికేషన్, రిక్రూట్‌మెంట్, శిక్షణ అంటూ సంస్థ ఉద్యోగ వేట మళ్లీ మొదలవుతుంది’’అని ఇంకో నెటిజన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘కనీసం రెజ్యూమె చదవకుండా, ఏవేవో పిచ్చి కారణాలు చెప్పకుండా నిజాయతీగా రిప్లై ఇచ్చిన సంస్థను మెచ్చుకోవాల్సిందే’ అని ఇంకొకరు ట్వీట్‌చేశారు. దీంతో సరిగ్గా సరిపోయే అర్హతలున్న వారికి ఉద్యోగం ఇవ్వాలా? లేదంటే కాస్తంత తక్కువ అర్హత ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చి తమకు తగ్గట్లు తీర్చిదిద్దుకోవాలా? అన్న చర్చ మొదలైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.