అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో
జంతుప్రేమికులు ఎక్కువగా కుక్కలను పెంచుకునేందుకు ఇష్టపడతారు. విశ్యాసంలో దీనికి సాటి మరెవరూ ఉండరు. అందుకే శునకాలను ఎక్కువగా పెంచుకుంటారు. సాధారణంగా మనం ఓ కుక్కపిల్లను కొనుక్కోవాలంటే.. రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు ఖర్చు అవుతుంది. కానీ వ్యక్తి ఏకంగా రూ.50 కోట్లు పెట్టి కుక్కను కొనుగోలు చేశాడు. వామ్మో కుక్కకోసం ఏకంగా రూ. 50 కోట్లా అనుకుంటున్నారా...నిజమేమరి..! బెంగళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి ‘కాడాబాంబ్ ఒకామి’ అనే అరుదైన జాతికి చెందిన ‘వోల్ఫ్ డాగ్’ను 5.7 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.50 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు.
దాని వయసు 8 నెలలు అని.. రోజుకు 3 కేజీల పచ్చి మాంసం తింటుందన్నాడు సతీష్. ఎందుకని ఇంత ఖర్చు చేసి ఈ కుక్కను కొనుగోలు చేశారని అడిగితే.. తనకు కుక్కలంటే చాలా ఇష్టమని, అందుకే దీనిని కొనుగోలు చేసేందుకు అంత ఖర్చు చేశానని చెప్పారు. అరుదైన, ప్రత్యేకమైన కుక్కలను ఇండియాకు పరిచయం చేయడం అంటే తనకు ఇష్టమట. ఈ డాగ్ అమెరికాలో జన్మించిందట. దీనిబరువు సుమారు 75 కిలోలు ఉంటుందట. ఈ కుక్క తోడేలు లాంటి లక్షణాలు కలిగి ఉండటంతో.. భారతదేశపు అన్యదేశ పెంపుడు జంతువులలో ఒకదానిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. వాస్తవానికి పదేళ్లుగా సతీష్ కుక్కల పెంపకాన్ని వదిలేశాడు. కానీ, అరుదైన జాతుల పట్ల తనకున్న ప్రేమను కొనసాగిస్తూ.. డబ్బులు సంపాదించేందుకు ఓ లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒకామి, ఇతర జాతులకు చెందిన అరుదైన కుక్కలను 30 నిమిషాల పాటు ప్రదర్శనకు పెట్టి.. రూ. 25 వేలు సంపాదిస్తున్నాడు.