గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..
బిడ్డ కోసం ఏం చేయడానికైనా తల్లి సిద్ధపడుతుంది. బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందంటే తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. తన ప్రాణాలను లెక్క చేయకుండా బిడ్డను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. అలాంటిది టినమౌ నిప్పుకోళ్లలో మాతృత్వపు లక్షణాలు మచ్చుకైనా కనిపించవు. ఆడ కోళ్లు అడవుల్లో నేల మీదే గూళ్లు కట్టి వాటిల్లో గుడ్లు పెడతాయి.
ఆ తర్వాత అక్కడ అవి కనిపించవు మగ కోళ్లతో జత కట్టానికి జంప్ అవుతాయట. గుడ్లు పొదిగి బయటికొచ్చే పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రకృతి తల్లికి ఇవ్వడం మరిచిందేమో! తల్లి కోడికి ఉండాల్సిన మాతృత్వపు లక్షణాలు మగ కోడికి ఉండటం విడ్డూరం. ఆడ కోళ్లు పెట్టే గుడ్లు పెద్ద సైజ్‌లో చూడటానికి అన్ని రంగుల్లో ప్రకాశవంతంగా మెరుస్తాయి. రంగుల్లో గుడ్లను పెట్టడం టినమౌ నిప్పుకోళ్ళ ప్రత్యేకత. బ్లూ గ్రీన్, చాక్లెట్ బ్రౌన్, ఊదా రంగు, లైట్ పింక్‌లో ఇవి గుడ్లు పెడతాయి. ఇవి చూడటానికి ఎంతో అందంగా చిత్రకారుడి కుంచె నుంచి రూపుదిద్దుకున్న పెయింటింగ్‌లా ఉంటాయి. ఇక అంతే గుడ్లు పెట్టడం వరకే తల్లి పక్షి బాధ్యత. ఆ తర్వాత ఎంతో అందంగా ఆకర్షించే ఆ గుడ్లను ఏ జంతువులు ఎత్తుకెళ్లకుండా గటుక్కున మింగకుండా కాపాడే బాధ్యత తండ్రి కోడిది. గుడ్లను పొదగడం దగ్గర్నుంచి పిల్లలకు ఆహారం తెచ్చి పెట్టి పెద్ద చేసే పనులన్నీ మగ పక్షులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయట. సెంట్రల్ అమెరికా అడవుల్లో ఒంటరిగా కొన్ని సమూహాలలో జీవిస్తాయి టినమౌ నిప్పుకోళ్లు.