Khairatabad Ganesh: ఈసారి ఖైరతాబాద్ గణేష్‌ లడ్డూ ఎన్ని వేల కేజీలో తెల్సా..?

| Edited By: Ram Naramaneni

Sep 18, 2023 | 5:45 PM

తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేష్‌కు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది.. ఈసారి శ్రీ దశ మహా విద్యా గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణేష్, స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద మొత్తంలో భక్తులు చేరుకుంటున్నారు.. అయితే ఈసారి విగ్రహం ఎత్తుతో పాటుగా స్వామివారి లడ్డూ కూడా ప్రత్యేకత సంతరించుకుంది. 2000 కిలోల లడ్డూను బాపుఘట్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి స్వామి వారికి సమర్పించనున్నారు. 2016 లో 60 కిలోల పైగా లడ్డూను సమర్పించిన శ్రీకాంత్ ఏడాదికి.. ఏడాదికి కిలోలను పెంచుకుంటూ ఈసారి రెండువేల కిలోలను స్వామివారికి ప్రసాదంగా ఇవ్వనున్నారు. ప్రస్తుతం లడ్డు తయారీ వేగంగా కొనసాగుతోంది.. 15 మంది వ్యక్తులు లడ్డు తయారు చేస్తున్నారు.. ఈ లడ్డూ కోసం 450 కిలోల శనగపిండి, 900 కిలోల చక్కెర, 600 కిలోల నూనె, నెయ్యితో సహా 5 కిలోల యాలకుల పొడితో ఈ లడ్డూను తయారు చేస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఈసారి 63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమిస్తోంది. ఖైరతాబాద్ గణేశుడి దగ్గర భక్తుల కోలాహలం అంతకంతకు పెరుగుతోంది. ఖైరతాబాద్ మహా గణేశుడికి ఉదయం 9.30 గంటలకు పూజలు ప్రారంభమయ్యాయి. పండుగ రోజే దాదాపు లక్ష మంది భక్తులు ఖైరాతబాద్ గణపతిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బారీకేడ్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు మంత్రి తలసాని. మరోవైపు గణేష్ చతుర్థి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటామన్నారు హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ. దేశంలో ఖైరతాబాద్‌ వినాయకుడు ఎత్తైన మట్టి విగ్రహం అన్నారు గవర్నర్ తమిళిసై .గణేషుడి పూజలో పాల్గొనడం ఆనందంగా ఉందంటూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం