Srisailam: శ్రీశైలం క్షేత్రానికి ఘాట్‌రోడ్డు ఎప్పుడు వేశారు ?? పూర్వం భక్తులు ఎలా వెళ్లేవారు ??

Updated on: Nov 27, 2025 | 4:35 PM

శ్రీశైలం పుణ్యక్షేత్రం నల్లమల అడవుల మధ్య ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఘాట్ రోడ్ నిర్మించకముందు భక్తులు దట్టమైన అడవులను, కొండలను దాటి ఎంతో కష్టపడి చేరుకునేవారు. గుర్రాలపై, పల్లకీలలో లేదా కాలినడకన యాత్ర చేసేవారు. 75 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేసి, మల్లికార్జున స్వామి దర్శనాన్ని చేరువ చేసింది.

శ్రీశైలం పుణ్యక్షేత్రం.. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. హరహర మహదేవ శంభో శంకరా అంటూ నిత్యం భక్తులు కొలిచే కొంగుబంగారం. నల్లమల అడవులలో మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం. ఇప్పుడంటే బస్సులు, కార్లలో రయ్‌ రయ్‌మంటూ ఘాట్‌ రోడ్డు గుండా దూసుకెళుతున్నారు గానీ, పూర్వం రోడ్డు సౌకర్యం లేనప్పుడు భక్తుల పరిస్థితి ఏంటి అనే సందేహం చాలా మందిలో మెదులుతూనే ఉంది. అసలు భక్తులు శ్రీశైలం ఎలా వెల్లేవారు. దట్టమైన నల్లమల అడవులు, మహా పర్వాతాలు దాటి మల్లన్నను ఎలా దర్శించుకునే వారు అనే ప్రశ్నలు సాధారణ భక్తులకు కలుగుతూనే ఉంటాయి. 75 ఏళ్ల క్రితం.. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలా ఉండే దట్టమైన నల్లమల అటవీమార్గం ద్వారా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళేవారు. ధనవంతులైతే గుర్రాలు, పల్లకీల్లో వెళ్ళేవారు. సామాన్యులకు కాలినడకే దిక్కు… అటవీమార్గంలో వెళ్ళే దారిలో వన్యమృగాలు దాడి చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే ఏడాడికొకసారి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళితే గొప్పగా చెప్పుకునేవారు. నేరుగా రోడ్డు వేసేందుకు అంతా కొండలు, గుట్టలతో నిండిన ఘాట్‌ అయిపోవడంతో రహదారి నిర్మాణం అంత తేలికైనపని కాదు. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కి మెరుగైన ఘాట్‌ రోడ్డు నిర్మించడానికి 75 క్రితం బీజం పడింది. శ్రీశైలం వెళ్ళేందుకు భక్తులు కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఉన్నట్లు హోటళ్ళు, రెస్టారెంట్లు లేవు. అక్కడక్కడ పూటకూళ్ళ ఇళ్లే ప్రధాన వసతిగా ఉండేది. 1950 లో అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి పియస్‌ కుమారస్వామిరాజా, ఆర్ధిక మంత్రి బెజవాడ గోపాలరెడ్డిలు రోడ్డు ఆలోచన చేశారు. ఇంజనీర్లతో కలిసి శ్రీశైలం చేరుకుని ప్రణాళిక రూపొందించారు. ఆ తరువాత శ్రీశైల జగద్గురు వాగీశ పండితారాధ్య శివాచార్య మహా స్వాముల స్నేహితుడిగా ఉన్న నాటి మద్రాసు గవర్నర్‌ ప్రకాశ్‌కు శ్రీశైలం క్షేత్రానికి ఘాట్‌ నిర్మాణం గురించి వివరించి అనుమతి మంజూరు చేయించుకున్నారు. దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 1955 నుంచి 1957 వరకు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగాయి. కొండల మీదుగా అటవీమార్గంలో 49 కిలోమీటర్ల మేర 69 లక్షల 70వేల రూపాయల వ్యయంతో ఘాట్‌ రోడ్డును పూర్తి చేశారు. అప్పటి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి యస్.నిజలింగప్ప 1957 నవంబర్‌ 24న ఘాట్‌రోడ్డుకు ప్రారంభోత్సవం చేశారు. ఇక నాటి నుంచి భక్తులు సులభంగా శ్రీశైలం చేరుకుని భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్డు ఏ టైంలో తింటే మంచిది.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

అంబేద్కర్ పేరునూ సహించలేరా ?? కోనసీమ జిల్లా పేరుపై మరోసారి రగడ

బైకర్‌ను ఆపిన ట్రాఫిక్‌ పోలీస్‌.. అతని బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్‌

ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం

40 సార్లు ఫారిన్ ట్రిప్పులు.. 5 ఏళ్లలో రూ.100 కోట్లు.. ఐబొమ్మ రవి లగ్జరీ లైఫ్ ను చూస్తే