బీ అలర్ట్‌.. వచ్చే రెండు రోజులూ వణుకే.. మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Updated on: Dec 29, 2025 | 7:09 PM

తెలుగు రాష్ట్రాలను చలి తీవ్రత వణికిస్తోంది. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరాయి; పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి. ఏపీలోని మన్యంలోనూ చలి దారుణంగా ఉంది, పాడేరు, అరకులలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పర్యాటకులు పాడేరు ఏజెన్సీకి తరలివచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు, స్థానిక గిరిజనులు వారిని దింసా నృత్యాలతో స్వాగతిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్య అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గత పది రోజులుగా తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ఈ క్రమంలో చలికి సంబంధించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, మంచిర్యాల, నిర్మల్ సంగారెడ్డి జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, మహబూబ్ నగర్,వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఏపీలోని మన్యంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. మినుములూరు 5, అరకు 6, పాడేరు 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో పగటిపూట 24–25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా, రాత్రి సమయంలో 18–19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ ప్రకటించింది. ఇక..పాడేరు ఏజెన్సీలో టూరిస్టుల తాకిడి పెరిగింది. వీకెండ్ కావడంతో మాడగడ, వంజంగి మేఘాల కొండలకు వస్తున్న టూరిస్టులు అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సూర్యోదయం సమయంలో చెట్ల మధ్య మంచు తెరలను చీల్చుకుంటూ భానుని కిరణాలు నేలను తాకే సన్నివేశాలను చూసేందుకు వేకువజామునే వారు అక్కడి కొండ ప్రాంతాలకు చేరుతున్నారు. పర్యాటకులను స్థానిక గిరిజనులు దింసా నృత్యాలతో స్వాగతం పలుకుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాంగ్ స్టర్‌ నామినేషన్‌.. కట్టేసిన చేతులు ముఖానికి నల్లటి గుడ్డతో

చలి ఎఫెక్ట్.. చుక్కల్లో కూరగాయల ధరలు ఇప్పటికే కేజీ ధర సెంచరీ క్రాస్‌

వైభవంగా ముగిసిన మండల పూజ.. శరణుఘోషతో ప్రతిధ్వనించిన శబరిగిరులు

‘ధురందర్’ పాక్‌ ఆసిమ్ మునీర్‌కు వెన్నులో వణుకు

తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర