ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ 47 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 229 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు అంతర్భాగ తమిళనాడు.. రాయలసీమ మీదుగా ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి వల్ల రాబోవు మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురవచ్చునని చెప్పింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4.30 గంటల వరకూ అవసరమైతే తప్పా బయటకు రావొద్దని సూచించారు వాతావరణశాఖ అధికారులు.