Monkey Menace: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆసక్తికర హామీ.. కోతుల సమస్యను పరిష్కరిస్తామంటూ..

|

Nov 18, 2023 | 11:47 AM

Telangana Polls: తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలను కాంగ్రెస్ పార్టీ జోడించింది. 66 హామీలు.. 6 గ్యారెంటీలతో విడుదల చేసిన మేనిఫెస్టలో కోతుల బెడదను కట్టడి చేస్తామన్న హామీని పొందుపర్చింది. మేనిఫెస్టోలో కోతుల సమస్యను కూడా పొందుపర్చి తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించింది కాంగ్రెస్.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార ఘట్టం హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించగా.. శుక్రవారం (నవంబరు 17)నాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసింది. గాంధీభవన్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలను కాంగ్రెస్ పార్టీ జోడించింది. 66 హామీలు.. 6 గ్యారెంటీలతో విడుదల చేసిన మేనిఫెస్టలో కోతుల బెడదను కట్టడి చేస్తామన్న హామీని కూడా పొందుపర్చింది. మేనిఫెస్టోలో కోతుల సమస్యను కూడా పొందుపర్చి తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించింది కాంగ్రెస్.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కోతుల బెడద కారణంగా రైతులు తీవ్రంగా పంటలను నష్టపోతున్నారు. గతంలో పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. కోతుల బెడదను పరిష్కరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కోతుల బెడదను పరిష్కరించాలని ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చే అభ్యర్థులను పలుచోట్ల రైతులు కోరుతున్నారు. కోతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే మీకు ఓటు వేస్తామని కండీషన్ పెట్టారు. ఈ నేపథ్యంలో కోతుల బెడత సమస్యను తన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఎన్నికల ప్రచారం దగ్గరపడుతుండటంతో ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ఉధృతం చేశాయి. తమ ఎన్నికల హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.