AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Update: సెగలు పుట్టిస్తున్న సూర్యుడు.. అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల జనం

Weather Update: సెగలు పుట్టిస్తున్న సూర్యుడు.. అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల జనం

Phani CH
|

Updated on: Apr 27, 2026 | 9:03 PM

Share

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్‌లో 45.3°C నమోదవ్వగా, పలుచోట్ల 41°C దాటింది. వడదెబ్బకు ముగ్గురు మరణించారు. IMD మరింత ఉష్ణోగ్రతలు పెరగవచ్చని హెచ్చరించింది. 11-4 గంటల మధ్య బయటకెళ్లొద్దని, ద్రవాలు అధికంగా తీసుకోవాలని, తేలికపాటి ఆహారం తినాలని అధికారులు సూచించారు. ఏప్రిల్ 29 నుండి వర్ష సూచన ఉపశమనం కలిగించవచ్చు.

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు సుర్రుమంటూ తన ప్రతాపం చూపుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఆదివారం ఇక్కడ రికార్డు స్థాయిలో ఏకంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 3.5 డిగ్రీలు అధికం కావడం గమనార్హం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కును దాటాయి. చాలా ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ ఎండల తీవ్రతకు రాష్ట్రంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకరు, నల్గొండ జిల్లా లో ఒకరు, సూర్యాపేట జిల్లాలో ఒకరు వ్యవసాయ పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి ప్రాణాలు విడిచారు. మధ్యాహ్న సమయాల్లో రైతులు, కూలీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత వాతావరణ శాఖ ప్రకారం.. సోమ, మంగళవారాల్లో ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎండల తీవ్రత మరింత అధికం కానుంది. అయితే, ఈ భగభగల నుంచి ఉపశమనం కలిగించేలా వర్ష సూచన కూడా ఉంది. సోమవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవవచ్చని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్‌ 29 నుంచి మే 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. వేపుళ్లు, మసాలా పదార్థాలకు దూరంగా ఉండి, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భానుడి ప్రతాపం భగభగలాడుతుండటంతో విపత్తు నిర్వహణ సంస్థ హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 26 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 14, విజయనగరంలో 8 మండలాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరితో పాటు కోస్తా ఆంధ్రలోని కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండనుంది. రాయలసీమలోని వైఎస్ఆర్ జిల్లాలో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మార్కాపురం జిల్లా కంభంలో ఆదివారం 44.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.1, వైఎస్సార్‌ కడప జిల్లా ఒంటిమిట్టలో 43.8, కర్నూలు జిల్లా నగరడోన, పల్నాడు జిల్లా గురజాలలో 43.7, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 43.5, అనంతపురం జిల్లా భట్టువానిపల్లిలో 43.4, శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో 43.2, తిరుపతి జిల్లా బేస్తపల్లిలో 43.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఎండ దెబ్బ, వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి విపత్తు నిర్వహణ సంస్థ కొన్ని కీలక సూచనలు చేసింది. ప్రధానంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగడం మానుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తలకి టోపీ లేదా గొడుగు ధరించాలి. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి దాహం వేయకపోయినా తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, వంటి ద్రావణాలు తీసుకోవాలి. మద్యం, టీ, కాఫీలు, అధికంగా మసాలాలు వడిన ఆహారపదార్థలకు దూరంగా ఉండాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లల విషయంలో అదనపు జాగ్రత్తలు అవసరం. వడదెబ్బ లక్షణాలు తల తిరగడం, వాంతులు, అధిక జ్వరం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఇప్పటికే స్థానిక సంస్థల ద్వారా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. పశువుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, వాటికి సరైన నీటి సదుపాయం కల్పించాలని పశుసంవర్ధక శాఖ సూచించింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం అవసరమని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..! తెలంగాణ లో ఉచిత బ్యాంకింగ్ కోచింగ్

Paytm: పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. లైసెన్స్ రద్దు

రాష్ట్రంలోనే తొలి ‘హెల్మెట్ బ్యాంక్’ ప్రారంభం.. ఎక్కడో తెలుసా ??

Shakti App: అర్ధరాత్రి వేళ.. యువతిని కాపాడిన శక్తి యాప్‌

పులిగుండాల అడవుల్లో చిరుతలు.. ట్రాప్ కెమెరాలో అరుదైన దృశ్యాలు

Published on: Apr 27, 2026 09:02 PM
Follow Us