AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. మానవాళికి డెత్ వారెంట్.. !

ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. మానవాళికి డెత్ వారెంట్.. !

Phani CH
|

Updated on: Apr 28, 2026 | 1:59 PM

Share

ఏప్రిల్‌లోనే అధిక ఉష్ణోగ్రతలు 'సూపర్ ఎల్‌నినో' రాకకు సంకేతం. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇది సంభవిస్తుంది. భారత్‌లో రుతుపవనాలను బలహీనపరిచి, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నీటి కొరత, ఆహార ధరల పెరుగుదల, వడదెబ్బ ప్రమాదం హెచ్చరికగా భావించి ప్రజలు, ప్రభుత్వాలు తక్షణమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా ఏప్రిల్ నెల అనగానే ఉష్ణోగ్రతలు పెరుగుతాయని మనకు తెలుసు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే భయమేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో అప్పుడే 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 45.4 డిగ్రీలు, కడప, సాలూరులో 45.1 డిగ్రీలు, ఆళ్లగడ్డలో 44.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవ్వడం మామూలు విషయం కాదు. నిజానికి, ఈ స్థాయి ఎండలు ‘రోహిణీ కార్తె’ సమయంలో, అంటే మే 25వ తేదీ తర్వాత ఇంత ఎండ తీవ్రత ఉంటుంది. రోహిణీకార్తెలో రోళ్లు పగులుతాయి అని పెద్దలు అంటూ ఉంటారు. అంటే.. రాతి రోళ్లు పగిలేంత గట్టి ఎండలు కాస్తాయని అర్థం. కానీ, ఒక నెల ముందుగానే ఆ స్తాయిలో ఎండలు మండిపోతున్నాయి. అయితే ఇది కేవలం వేసవి కాలం ఎండ వేడి మాత్రమే కాదట.. ప్రపంచ వాతావరణాన్ని అతలాకుతలం చేయబోతున్న ‘సూపర్ ఎల్‌నినో’ రాకకు సంకేతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. ఈ ఎల్‌నినో అంటే ఏమిటి? అది వాతావరణాన్ని అతలాకుతలం చేయడం ఏంటి? అనే విషయానికి వస్తే.. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ఉష్ణమండల ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా పెరగడాన్ని ‘ఎల్‌నినో’ అని పిలుస్తారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా ఇది ‘లిటిల్ బాయ్’ అని పిలవబడే చల్లని స్థితికి విరుద్ధంగా పనిచేస్తూ, భూమి యొక్క వాతావరణ చక్రాలను దెబ్బతీస్తుంది. ఈ ఏడాది సంభవించేది ‘సూపర్ ఎల్‌నినో’ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంటే, సాధారణ ఎల్‌నినో కంటే ఇది ఎన్నో రెట్లు శక్తివంతమైనది. ప్రపంచ వాతావరణ సంస్థలు ఇప్పటికే ప్రమాద గంటలు మోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన NOAA (National Oceanic and Atmospheric Administration) నివేదిక ప్రకారం, మే నుండి జులై మధ్యలో ఎల్‌నినో ఏర్పడటానికి 61 శాతం అవకాశం ఉంది. అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ‘యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్’ (ECMWF) అంచనాల ప్రకారం.. ఆగస్టు నాటికి ‘సూపర్ ఎల్‌నినో’ ఏర్పడటానికి 22 శాతం, ‘స్ట్రాంగ్ ఎల్‌నినో’ ఏర్పడటానికి 80 శాతం, మరియు ఒక మోస్తరు ఎల్‌నినో ఏర్పడటానికి 98 శాతం అవకాశాలు ఉన్నాయి. అంటే, రాబోయే నెలల్లో మనం వాతావరణ మార్పులను తీవ్రంగా ఎదుర్కోవాల్సిందేనని స్పష్టమవుతోంది. భారతదేశ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటాయి. ఎల్‌నినో ఏర్పడినప్పుడు, సాధారణంగా రుతుపవనాలు బలహీనపడతాయి. ఇది మన దేశానికి ఎంతో ప్రమాదకరం. మంచి వర్షాలు కురవాల్సిన చోట వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. దీనివల్ల కరువు కాటకాలు ఏర్పడే అవకాశం ఉంది. వర్షాలు పడాల్సిన చోట పడకుండా, ఎడారి ప్రాంతాల్లో లేదా పొడి ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే విపరీతమైన వాతావరణ మార్పులు కనిపిస్తాయి. నైరుతి రుతుపవనాలు గాడి తప్పితే, దాని ప్రభావం ఈశాన్య రుతుపవనాలపై కూడా పడుతుంది. ఇది ఏడాది పొడవునా వ్యవసాయాన్ని దెబ్బతీస్తుంది. కేవలం వాతావరణం మాత్రమే కాదు, ఎల్‌నినో ప్రభావం నేరుగా మన జేబుపై కూడా పడుతుంది. స్వయంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, ఎల్‌నినో వల్ల ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది. పంటలు దెబ్బతింటే దిగుబడి తగ్గుతుంది, సరఫరా తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. రాబోయేది మామూలు ఎండాకాలం కాదు, ఇది ఒక క్లిష్టమైన కాలం. ఈ నేపథ్యంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. భూగర్భ జలాలు ఇప్పటికే చాలాచోట్ల అడుగంటిపోయాయి. రాబోయే రోజుల్లో నీటి కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రతి చుక్కనీటిని పొదుపు చేయాలి. తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ప్రజల ఆరోగ్యం విషయానికి వస్తే.. 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ… ఎండలు ఠారెత్తిస్తాయి. తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికివెళ్లినా హై-టెంపరేచర్ ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతాయి. వడదెబ్బ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ఏప్రిల్ నెలలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు కావడం అనేది మనకు ప్రకృతి ఇస్తున్న ఒక ముందస్తు హెచ్చరిక. వాతావరణ మార్పులు అనేది ఇప్పుడు ఏదో పుస్తకాల్లో చదువుకునే అంశం కాదు, మన కంటి ముందు కనిపిస్తున్న వాస్తవం. సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల రాబోయే నెలలు సవాలుతో కూడుకున్నవి. ప్రభుత్వాలు, ప్రజలు సమన్వయంతో ఉంటూ, ఈ వాతావరణ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇప్పటి నుండే సన్నద్ధం కావాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్నారా.. పన్ను కట్టాల్సిందేనా? అసలేం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు

122 ఏళ్ల తర్వాత వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నిజం! గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం

పౌడర్ రాసుకుంటేనే కూలీ.. లేదంటే..!

Director Shankar: రజినీకి విలన్‌గా డైరెక్టర్ శంకర్

Follow Us