భారత్‌లో రియల్ ఎస్టేట్ దూకుడు..53% పెరిగిన విక్రయాలు!
భారతదేశంలో విలాసవంతమైన గృహాల కోసం డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. ప్రత్యేకించి రూ. 4 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న గృహాల డిమాండ్ బాగా పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ విశ్లేషించింది. ఈ గృహాల విక్రయాలు 2024లో ఏడు ప్రధాన నగరాల్లో 53 శాతం పెరిగాయని పేర్కొంది. గత ఏడాది విక్రయించిన మొత్తం లగ్జరీ హౌసింగ్ యూనిట్ల సంఖ్య 19,700గా ఉంటే, 2023లో విక్రయించిన 12,895 యూనిట్లుగా ఉంది. ఢిల్లీ NCPR ప్రాంతం లగ్జరీ గృహాలకు అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిందని ఆ డేటాలో తెలిపారు.
2024లో ఈ ప్రాంతంలో 10,500 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే 2023లో కేవలం 5,525 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. నోయిడా, బెంగళూరు, పూణే, చెన్నై వంటి నగరాల్లో మధ్యతరగతి అభివృద్ధితో ఉన్నత-స్థాయి ప్రాజెక్టుల వైపు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో కీలకమైన ముంబైలో అమ్మకాలు బాగా పెరిగాయి. 2024లో 5,500 లగ్జరీ యూనిట్లు అమ్ముడుకాగా 2023లో 4,200 యూనిట్లు అమ్ముడయ్యాయి. పూణేలోని లగ్జరీ హోమ్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ నగరంలో అమ్మకాలు 400 యూనిట్ల నుంచి 825 యూనిట్లకు పెరిగాయి. అయితే బెంగళూరులో స్వల్ప క్షీణత నమోదైంది. ఇక్కడ అమ్మకాలు గతేడాది 265 యూనిట్లు ఉంటే ప్రస్తుత త్రైమాసికంలో 50 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.